భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అధినేత కేసీఆర్ ఎక్కడ? చివరిసారిగా గత నెల ఆఖరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైన ఆయన ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. ఇక కేసీఆర్ శాసన సభకు 20 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష నేతగా వచ్చారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయిన ఆయన.. కేవలం ఒక్క రోజు మాత్రమే సభకు హాజరు అయ్యారు.
హామీల అమలు విషయంలో అధికార పార్టీని చీల్చి చెండాడుతానని ప్రకటించారు. కానీ మీడియా పాయింట్ లో ఆ ప్రకటన చేసిన తర్వాత కేసీఆర్ మళ్లీ కనిపించనే లేదు. ఇంతకు ఆయన ఎక్కడ ఉన్నారు. హైదరాబాద్ లోనా.. లేక ఫాం హౌజ్ లోనా..
కేసీఆర్ తెలంగాణ ఎన్నికల్లో ఓటమి అనంతరం నేరుగా ఎర్రవల్లి లోని ఫాం హౌజ్ కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ అనూహ్యంగా గాయపడ్డారు. ఇక ఆ తర్వాత హైదరాబాద్ నందినగర్ లోని ఇంట్లోనే ఉంటున్నారు. లోక్ సభ ఎన్నికల నాటికి గాయం నుంచి కోలుకున్న కేసీఆర్ ప్రచారం కూడా చేశారు. ఇక జులై ఆఖర్లో అసెంబ్లీకి తొలిసారి వచ్చారు. అంటే సరిగ్గా నెల రోజులు అవుతుంది. కానీ ఆ తర్వాత ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కనిపించడం లేదు. దీంతోనే కేసీఆర్ ఫాం హౌజ్ లో ఉన్నారా.. హైదరాబాద్ లో ఉన్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
ఎన్ని విమర్శలు ఉన్నా కేసీఆర్ వ్యూహ చతురతను మెచ్చుకోకుండా ఉండలేం. తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో మెదక్ ఎంపీగా కూడా ఉన్న కేసీఆర్ తన ఫాం హౌజ్ నుంచే మొత్తం వ్యూహాన్ని నడిపించారు. ప్రత్యేక రాష్ట్రం ఖరారైన దశలోను పార్లమెంట్ కు వెళ్లారు. అందుకే కేసీఆర్ మౌనం.. ఓ భారీ వ్యూహానికి నేపథ్యం అనుకోవాలేమో.. కేసీఆర్ ఇప్పుడు చక్రబంధంలో ఉన్నారు. ఆయన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు వెళ్లిపోతున్నారు. కుమార్తె కవిత జైల్లో ఉన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అయితే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ సమయంలో కేసీఆర్ ఎలా కమ్ బ్యాక్ ఇస్తారో చూడాలి.