తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా.. రెండు పర్యాయాలు ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ ను గెలిపించారు. 2023 నవంబరు లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ను గద్దె దించి.. కాంగ్రెస్ పట్టం కట్టారు. డిసెంబరులో రేవంత్ రెడ్డి సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.



అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ హామీని నిలబెట్టుకున్నారు. తర్వాత రూ.500లకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేశారు. ఇంతలో లోక్ సభ ఎన్నికలు రావడంతో హామీల అమలు నిలిచిపోయాయి. ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రైతుల పంట రుణాల మాఫీ పై దృష్టి పెట్టారు. జులై 18 నుంచి ఆగస్టు 15 వరకు మూడు విడతల్లో రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేశారు.  


ఇప్పుడు మాఫీ పూర్తి కావడంతో మరిన్ని హామీలపై సీఎం రేవంత్ దృష్టి సారించారు. తెలంగాణలో ప్రతి పథకానికి రేషన్ కార్డు తప్పని సరి చేస్తున్ననేపథ్యంలో ఎన్నికల సమయంలో హామీ మేరకు అర్హులకు రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. ఇక తెలంగాణలో పదేళ్లుగా రేషన్ కార్డులు జారీ కాలేదు. తాము అధికారంలోకి  వస్తే రేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.


కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ హెల్త్ కార్డులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సీఎం వారికి గుడ్ న్యూస్ చెప్పారు. సెప్టెంబరు 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సచివాలయంలో 27న వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి సెప్టెంబరు లో పది రోజుల పాటు ప్రజా పాలన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు కోసం వివరాలు సేకరిస్తామని తెలిపారు. పూర్తి హెల్త్ ప్రొఫైల్ తో రాష్ట్రంలో ప్రతి పౌరుడికి హెల్త్ కార్డులు జారీ చేస్తామని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: