వైసీపీని ఒంటరి చేసే మూడు పార్టీలూ పంచుకుంటున్నాయి. ఇందులో కూడా మిత్రులు తమదైన బలానికి తగినట్లు రాజకీయ నిష్పత్తిని పాటిస్తున్నారు. వైసీపీ నేతలను సింభ భాగం టీడీపీ తీసుకుంటుంటే.. కొందరు నేతలను జనసేన లాగేసుకుంటుంది. ఇక మిగిలిన నేతలను బీజేపీ చేరదీస్తోంది.


కూటమిలో మేమేమీ తక్కువ తిన్నామా అన్నట్లు కమలనాథులు కూడా వైసీపీపై గురి పెట్టారు. వైసీపీలో మంచి నేతలకు బీజేపీ తలుపులు తీసి స్వాగతం పలుకుతున్నామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. పార్టీ కోసం చిత్త శుద్ధితో పనిచేస్తానంటే చేర్చుకోవడానికి అభ్యంతరం లేదని ఆమె తెల్చి చెప్పారు.


దాంతో బోణీగా విజయవాడకు చెందిన కార్పోరేటర్ ను చేర్చుకున్నారు. నిజానికి విజయవాడలో ఎక్కువ మంది కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్లారు. ఇక అరకొరగా మిగిలిన వారికి బీజేపీ గాలం వేస్తోంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంతో తాజాగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 39వ వార్డుకు చెందిన గుడివాడ నరేంద్ర రాఘవ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలోని వైసీపీ కార్పోరేటర్లు మైలవరకు రత్న కుమారి, మైలవరకు లావణ్య మాధురి, హర్షద్ లు టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని నాయకత్వంలో సైకిల్ ఎక్కేశారు. ఇప్పుడు ఇక్కడ మిగిలిన వారితో బీజేపీ బోణీ కొట్టింది.


ఈ చేరిక విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి సమక్షంలో జరిగింది. ఇంకా చాలామంది కూటమిలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు అని సుజనా చౌదరి అన్నారు. ఎవరు వచ్చినా విజయవాడ ప్రగతి కోసం అయితే కచ్ఛితంగా తీసుకుంటామని కుండ బద్దలు కొట్టారు.


ఇదిలా ఉండగా టీడీపీలోకి వైసీపీ ఏలూరు మేయర్ చేరిపోయారు. ఆమెతో పాటు పెద్ద ఎత్తున వైసీపీ కార్పొరేటర్లు కూడా జాయిన్ అయ్యారు. విశాఖ కార్పోరేషన్ లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ మెజార్టీ కూటమికే ఉంది. ఇదిలా ఉండగా వైసీపీలోకి ద్వితీయ శ్రేణి నాయకులను తమ వైపు తిప్పుకునేందుకు కూటమి లోని మూడు పార్టీలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో ఒంటరి అయిన వైసీపీ ఏమీ చేయలేకపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: