దేశంలో సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటి వరకు 50 మందికి పైగా అరెస్టు చేశాయి. వీరిలో చాలా మంది అప్రూవర్లుగా మారి బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే ఇదే కేసులో అరెస్టై జైలుకి వెళ్లిన దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా సుమారు ఏడాదికి పైగా జైల్లో ఉన్నారు. ఆయన అప్రూవర్ గా మారకపోవడంతో చాలా కాలం బెయిల్ లభించలేదు.


ఇక దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలు అప్రూవర్స్ గా మారకపోవడంతో చాలా రోజులు బెయిల్ లభించ లేదు.  దీంతో విచారణ కోసం వారికి బెయిల్ ఇవ్వొద్దని దర్యాప్తు సంస్థలు కోర్టులను కోరుతూ వచ్చాయి. దీంతో వీరికి బెయిల్ రావడం గగనం అయింది. అయితే తాజాగా కవితకు దేశ సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. సుమారు ఐదున్నర నెలలు జైల్లో ఉన్న కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు పండుగా చేసుకుంటున్నారు. అయితే కవిత బెయిల్ పై పొలిటికల్ వార్ మొదలైంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.


కవితకు బెయిల్ రావడం ఊహించిందే అని కాంగ్రెస్క పేర్కొంది. బీజేపీ, బీఆర్ఎస్ రహస్య ఒప్పందంలో భాగంగానే ఆమెకు బెయిల్ వచ్చిందని ఆరోపించింది. కవిత బెయిల్ కోసం కేటీఆర్ దిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేశారని.. ఎట్టకేలకు ఆయన ప్రయత్నం ఫలించిందని విమర్శించింది.


ఇదే విషయమై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు కావడం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని ఆరోపించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ వ్యక్తికి బెయిల్, కాంగ్రెస్ వ్యక్తికి రాజ్యసభ సీటు ఒకేసారి వచ్చాయని పేర్కొన్నారు. ఈ విషయమై కేటీఆర్ స్పందిస్తూ.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కోర్టు తీర్పుపై అభ్యంతరాలు  వ్యక్తం చేస్తారా అని ప్రశ్నించారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టుని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: