చంద్రబాబుకి అనుకూలంగా.. ఆయనకు గిట్టని పార్టీల మీద వ్యతిరేకంగా వార్తలను ఏబీఎన్ ఎప్పటి నుంచో రాస్తుంది. రాధాకృష్ణకు చంద్రబాబుతో పొసగిన అంత ఈజీగా మరే ఇతర నాయకులతో ఉండదు. కేసీఆర్ తో అంతటి సాన్నిహిత్యం ఉన్నా ఎక్కడో తేడా కొట్టింది. అందుకే ఇద్దరూ ఉప్పు నిప్పులా మారిపోయారు. కానీ చంద్రబాబుకు ఆర్కేకి మధ్య ఇప్పటి వరకు అలాంటి పరిస్థితులు రాలేదు.
ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఈ ఐదు ఏళ్లు రాధాకృష్ణకు ప్రతి రోజు పండగే. ఇదే దశలో చంద్రబాబుకి అనుకూలంగానే ఆంధ్రజ్యోతి వార్తలు రాస్తుంది. జగన మీద ఇప్పటికీ బురద జల్లుతూనే ఉంటుంది. ఇది జాతి వైరం అనుకున్నా.. హఠాత్తుగా ఆంధ్ర జ్యోతి రూటు మార్చింది.
చంద్రబాబు కూటమి సర్కారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫస్ట్ పేజీలో వార్త ప్రచురించింది. సహజంగానే ఇలాంటి పరిణామం టీడీపీ నాయకులకు రుచించదు. ఆంధ్రజ్యోతి తమ పార్టీకి చెందిన పత్రికగా తెలుగు తమ్ముళ్లు భావిస్తుంటారు. మరి అకస్మాత్తుగా ఇలా బ్యానర్ వార్త ప్రచురించడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది.
గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా గల్లా మాధవి గెలిచారు. ఆమె భర్త మాధవరావు తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కమ్మ వెంకటరావు అనే వ్యక్తిని వేధించాడు. రూ.30లక్షలకే నాలుగు ఎకరాలు అమ్మాలని ఒత్తిడి తెచ్చాడు. పైగా ఆ వ్యక్తి మీద ఎస్సీ, ఎస్టీ అట్రిసటీ కేసు పెట్టాడు. దీనిపై అందరి అంచనాలు తలకిందులు చేస్తూ నాలుగు ఎకరాలు రూ.30 లక్షలు అనే శీర్షికతో బ్యానర్ కథనం ప్రచురితమైంది.
మాధవరావు వ్యవహారం అలా ఉంటే తాడిపత్రి ఎమ్మెల్యే జీఏసీ ఆస్మిత్ రెడ్డి ఇసుక అక్రమ రవాణపై నిరసనకు దిగారు. కేసు నమోదు చేయకుంటే సీఐ తనకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. దీనిపై కూడా స్థానిక నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అంటూ వార్తను ప్రచురించారు. మార్పు కోసం ప్రజలు ఆలోచన చేస్తే వైసీపీ అవలక్షణాలనే కూటమి ఎమ్మెల్యేలు ఒంట పట్టించుకున్నారని రాధాకృష్ణ డైరెక్ట్ గా రాసేశారు. మరి చంద్రబాబుకి ఆర్కేకి మధ్య గ్యాప్ ఏమైనా వచ్చిందా అని పలువురు గుసగుసలాడుతున్నారు.