ఏపీలో సార్వత్రిక  ఎన్నికల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కుదుపులు ప్రారంభం అయ్యాయి. ఎన్నికలు పూర్తైనా మూడు నెలలకే అతి పెద్ద సమస్య వచ్చి పడింది. నమ్ముకున్న వాళ్లే నీతో సాగలేమంటూ జగన్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇటీవల కాలంలో వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.


ఓ వైపు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, స్థానిక నాయకులు పార్టీ వీడుతుంటే.. తాజాగా రాజ్యసభ సభ్యులు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ బలహీన పడిందన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో కొనసాగితే తమకు రాజకీయ మనుగడ ఉండదనే ఉద్దేశంతో కొందరు కూటమి పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. అధికార పార్టీ వైపు ఇతర పార్టీ నాయకులు చూడటం సహజం. కానీ వైసీపీ అధినేత జగన్ కు అత్యంత విశ్వాస పాత్రులుగా పేరొందిన నాయకులు పార్లీ మారడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది.


వైసీపీలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని పార్టీ మారుతున్నారా లేక జగన్ కోవర్టులుగా ఇతర పార్టీల్లోకి పంపిస్తున్నారా అనే చర్చ ఓ వైపు సాగుతోంది. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావులు ఇప్పటికే వైసీపీకి, తమ పదవులకు రాజీనామా చేశారు. మిగిలిన ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాథరెడ్డి, ఆర్ కృష్ణయ్య, గొల్ల బాబూరావు పార్టీ మారతారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది.


వీరంతా వ్యాపారా రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ మారుతున్నారా లేదా జగన్ ఆదేశాలతో మారుతున్నారా ఎవరికీ అర్థం కావడం లేదు. గతంలో వైసీపీ ఎమ్మెల్యే, జగన్ కు అత్యంత సన్నిహితుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ మారడం.. ఆ తర్వాత తిరిగి సొంత గూటికి చేరడం చకచకా జరిగిపోయాయి. ఈయన ఎందుకు వీడారు, ఎందుకు చేరారో ఎవరికీ అర్థం కాలేదు. ప్రస్తుతం వైసీపీ నుంచి ఇతర పార్టీల్లోకి చేరుతున్న వ్యక్తుల వెనుక జగన్ ఉన్నారా లేదంటే అసంతృప్తితోనే మారుతున్నారా అనేది తేలాల్సి ఉంది. నాయకుల వ్యవహార శైలి ఆధారంగా మరి కొన్ని రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

cm