బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని.. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనిపించదని.. సీఎం దగ్గర నుంచి మంత్రుల వరకు అందరూ ఊదరగొట్టారు. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు భారీ ఎత్తున తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని పలు సందర్భాల్లో వారంతా వ్యాఖ్యానించారు.


ఇప్పటి వరకు ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. శ్రావణ మాసంలో భారీగా చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు లీకులిస్తూ వచ్చారు. కానీ అదేమీ జరగలేదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరుతున్న ఎమ్మెల్యేలకు అక్కడి పరిస్థితులు అనుకూలించడం లేదనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ లో చేరిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారంతా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారనే వాదన వినిపిస్తోంది. నేతల సమన్వయంలో కాంగ్రెస్ అధిష్ఠానం జోక్యం చేసుకోకపోవడంతో జంపింగ్ ఎమ్మెల్యేలకు ప్రతి చోటా సమస్యలు ఎదురవుతున్నాయనే ప్రచారం నడుస్తోంది.


చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యపై కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేయడం, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గం సహకరించకపోవడం.. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కి నియోజకవర్గ ఇన్‌ఛార్జి సరిత తో విభేదాలు ఏర్పడటం లాంటి విషయాలను బీఆర్ఎస్ నేతలు హైలెట్ చేస్తున్నారు. దీంతో జంప్ అవ్వాలనుకునే నేతలు కూడా ఆలోచనలో పడుతున్నారట.


అధికార పార్టీలోకి వెళ్లి ప్రాధాన్యం కోల్పోవడం కంటే.. సొంత పార్టీలోనే ఉంటూ పోరాడటం నయమనే భావనలో కొంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారట. బీఆర్ఎస్ ను చావుదెబ్బ కొట్టాలని భావించిన సీఎం రేవంత్ రెడ్డి కి సొంత పార్టీనేతలే సహకరించడం లేదనే అందుకే పార్టీలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదనే చర్చ నడుస్తోంది. పార్టీలో చేరిన వారికి పాతతరం, కొత్త నేతలకు మధ్య సమన్వయం కుదర్చడంలో అధిష్ఠానం విఫలమవుతుందనే వాదనలు ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ లో చేరేందుకు ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: