ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ ఇటీవల కాలంలో సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. ఆమె దూకుడు, వ్యూహాలు అన్నీ కూడా తగ్గిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి కారణం ఏంటి? ఎందుకు అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు సొంత అన్న జగన్ పై రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే.


ఎక్కడకి వెళ్లినా.. కన్నీరు పెట్టుకొని.. కొంగు చాపి మరీ ఓట్లు అభ్యర్థించారు. తన అన్నకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేశారు. ఇది ఎన్నికల తర్వాత కూడా కొనసాగింది. అయితే కొన్ని రోజులుగా ఆమె వాయిస్ తక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా రెండు మూడు సార్లు జగన్.. బెంగళూరు పర్యటనలు చేయడం.. అక్కడి కాంగ్రెస్ నాయకులతో రహస్య సమావేశాలు నిర్వహించడం దరిమిలా.. ఏపీలో మార్పులు రావడం ప్రారంభం అయ్యాయి. అప్పటి వరకు విషయం ఏదైనా అన్న పాలనతో ముడిపెట్టి విమర్శలు గుప్పించిన షర్మిళ తర్వాత కాలంలో తన దూకుడును తగ్గించారు.


నిజనాకి అప్పటికి సంబంధం లేకున్నా.. గోదావరికి వచ్చి రైతుల పొలాలు మునిగిపోయిన సమయంలో కూడా జగన్ పాలన సరిగా ఉండి ఉంటే.. ఎర్ర కాలువకు గండి పడేది కాదని దుయ్యబట్టారు. కచ్చితంగా అదే సమయంలో జగన్ దిల్లీ లో ధర్నా చేస్తున్నారు. ఇటు వైపు షర్మిళ వ్యూహాత్మకంగా గోదావరి జిల్లాల్లో పర్యటించి.. వరద నీటిలో దిగి మరీ అన్న చుట్టూ రాజకీయాలు చేశారు. ఆ తర్వాత మాత్రం వాయిస్ లో తేడా కనిపించింది.


ఎక్కడ ఏం జరిగినా దానికి పెద్దగా కలరింగ్ ఇవ్వకుండా.. సౌమ్యంగా స్పందిస్తున్నారు. గుడ్లవల్లేరు ఘటనపై కూడ స్పందించిన ఆమె.. ఎక్కడా కూడా తన అన్న పాలనను ప్రస్తావించలేదు. అలాగే ఇతర విషయాలు కూడా ట్వీట్లు చేస్తున్నా.. జగన్ పాలనలో ఇలా జరిగింది.. అలా జరగలేదు అని ప్రస్తావించడం లేదు. ఈ పరిణామాలు చూస్తుంటే ఏదో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇలా షర్మిళను ఎవరైనా కంట్రోల్ చేశారా.. లేక ఆమె పార్టీకోసం ఎంత చేసినా గుర్తింపు లేదని బాధపడుతున్నారా అనేది అర్థం కావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: