అదేంటో కానీ.. వైసీపీ అధినేత జగన్ కు నిజాలు ఇంకా బోధపడటం లేదు. ఇంకా ఆయన భ్రమల్లోనే ఉన్నారని అనిపించేలా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు ముందు నుంచి ఇప్పటి వరకు ఆయనలో అయితే మార్పులు పెద్దగా కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాపడుతున్నారు. దీంతో పార్టీలోను ఇదే తరహా చర్చ నడుస్తోంది.



ఆయనకు మాట్లాడటం రాదు.. తానేదో చేశానని ఇప్పుడు అదే పాటించాలని అంటారు. కానీ జనం నాడి వేరేగా ఉంది. తెరచాటున ఉండి ఏం చేసినా.. పెద్దగా ప్రాజెక్టు కాదు. నిజానికి జగన్ చేసిన మంచి ఏదైనా ఉండి ఉంటే.. అది ప్రజలు గుర్తించి ఉంటే అసలు 11 స్థానాలకు ఎందుకు పరిమితం అవుతారు అనేది మొదటి ప్రశ్న. చేసిన మంచిని ఆనాడు చెప్పుకోనివ్వలేదు. కేవలం తన భజన కోసమే ఎమ్మెల్యేలను ఇంటింటికీ తిప్పారన్నఅభిప్రాయమూ ఉంది. ఇదే పార్టీకి  పెద్ద మైనస్ గా మారింది. జగన్.. జగన్.. నామస్మరణతో మునిగి తేలిన నాయకులు తమను తాము మరిచిపోయారు.


ఫలితంగా జగన్ ను బూచిగా చూపించడంలో కూటమి నేతలు విజయవంతం అయ్యారు. ఇదే పార్టీ పతనానికి కారణమైంది. అలా కాకుండా.. నియోజకవర్గానికో జగన్ ని నిలబెట్టి నిలదొక్కుకొని ఉంటే.. నాయకులకు పగ్గాలు ఇచ్చి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది.ఇక ఇప్పుడు కూడా పాత సూత్రాన్నే పాటిస్తున్నారు. ఎవరిని నోరు విప్పనివ్వడం లేదు. ఎవరినీ బయటకు రానివ్వడం లేదు. అంతా నేనే చూసుకుంటా అన్నట్లు వ్యవహరిస్తున్నారు.


ఫలితంగా బలమైన గళం వినిపించే నాయకులు.. బలంగా ఎదుర్కొనే నాయకులు కూడా ఎవరు బయటకు రావడం లేదు. కాదు.. కాదు.. రానివ్వడం లేదు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇది అంతిమంగా వైసీపీకి చేటు తెస్తుందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఇప్పటికైనా పాఠాలు నేర్చుకొని నిజాల వెంట పరుగులు పెడితే… కొంతలో కొంతైనా తేరుకొనే అవకాశం ఉంటుంది. మరి జగన్ నెక్స్ట్ ఏ  విధమైన స్టెప్ తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: