విజయవాడ వరదల్లో అపార నష్టం వాటిల్లింది. వారం పాటు సీఎం చంద్రబాబు, టీడీపీ మంత్రులు ప్రజల  మధ్యే ఉన్నారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. వారిని ఆదుకునే ప్రయత్నం చేశారు. నిరంతరం సేవలు చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇప్పుడు అసలు ఘట్టం తెరమీదకి వచ్చింది. అదే బాధితులకు ఆర్థిక సాయం చేసే వ్యవహారం.


దీనిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ప్రాథమికంగా వచ్చిన నష్టం రూ.6880 కోట్ల వరకు ఉంటుందని చంద్రబాబు కేంద్రానికి నివేదిక పంపించారు. దీనిపైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు. అయితే రాష్ట్రంలోని బీజేపీ నాయకులు ఈ విషయంలో మౌనంగా ఉండటం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఎందుకంటే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి కూడా ఉన్నారు. మరి వీరికి బాధ్యత లేదా? వీరు కనీసం సమస్యలను పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదు. ఒక్క బీజేపీ రాష్ట్ర చీఫ్ పురంధేశ్వరి మాత్రం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చిన సమయంలో ఆయన వెంట ఉన్నారు.


అంతకు మించి ఆమె వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించలేదు. బాధితులకు భరోసా కూడా కల్పించలేదు. రాజకీయంగా మోదీ ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేశారని చెబుతున్న బీజేపీ నాయకులు కీలకమైన సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారన్నది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. వాస్తవానికి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర పరిస్థితి గురించి కేంద్రానికి వివరించి.. ఆర్థిక సాయం అందేలా చేయాల్సిన బాధ్యత స్థానిక నాయకులపై ఉంది.


ఇలా చేస్తే పార్టీ గ్రాఫ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయినా కూడా బీజేపీ నేతలు మౌనం వహిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు పంపిన ప్రాథమిక నివేదికను కేంద్రం ఏ మేరకు ఆమోదిస్తుందన్న విషయమపైనా అనేక సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు కేంద్రం హ్యాండ్ ఇస్తే.. అది రాజకీయంగా పెను దుమారానికి కారణం అవుతుంది. దీంతో పాటు నేతల మధ్య దూరానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: