తెలంగాణను ఇటీవల భారీ వర్షాలు వరదలు ముంచెత్తాయి. ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఇళ్లు, పంటలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రాణాలు సైతం పోయాయి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పరిధిలో వర్షాలు పడటంతో భారీ ఎత్తున నష్టం సంభవించింది. రూ. పది వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.
అయితే ఈ నష్టాన్ని చూసేందుకు కేంద్రం నుంచి కూడా బృందాలు వచ్చాయి. కేంద్ర మంత్రి ఏరియల్ సర్వే చేశారు. రెండు బృందాలు వచ్చి ఒకటి ఖమ్మంలో రెండోది మహబూబాబాద్ లో పర్యటించాయి. ఇదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దిల్లీ వెళ్లారు. రాష్ట్రంలో జరిగిన నష్టం గురించి ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలను కలిసి వివరించనున్నారు. వారిని కలిసి రాష్ట్రంలో జరగిని వరద బీభత్సాన్ని తెలియపరచనున్నారు. అలాగే.. ఆస్తి, ప్రాణ, పంట నష్టాలపైనా కేంద్ర ప్రభుత్వం పెద్దలకు వివరించి.. సాయం కోరనున్నారు. కేంద్రం తరఫున నిధులు ఇచ్చి ఆదుకోవాలని.. ఏపీ తెలంగాణకు ఒకే విధమైన సాయం ప్రకటించాలని విజ్ఙప్తి చేయనున్నారు.
ఇదిలా ఉండగా సీఎం రేవంత్ దిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పెద్దలను సైతం కలవబోతున్నారు. సీఎం తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లారు. అయితే ఈ పర్యటనలో పొన్నం తో పాటు కొత్తగా పీసీసీ చీఫ్ గా నియమితులైన మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. వీరంతా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ లను కలవనున్నారు. ఇప్పటికే పీసీసీ, ఎమ్మెల్సీలు, నామినేటేడ్ పోస్టులపై ఒక క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది.
ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ మంత్రి వర్గ విస్తరణపై పెట్టినట్లు కనిపిస్తోంది. గత డిసెంబరు 7న రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో ఆరుగురికి కేబినెట్ లో చోటు ఉంది. ముఖ్యంగా హోం శాఖ, విద్యా శాఖ, మున్సిపల్, మైనింగ్ తో పాటు పలు పోర్టు పోలియోలు ఖాళీగా ఉన్నాయి. ఈ క్రమంలో రేవంత్ మంత్రి వర్గంలో ఎవరి పేర్లు చెబుతారో అనే ఆందోళన కాంగ్రెస్ నాయకుల్లో నెలకొంది.