తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశాలున్నాయి అనేది అందరూ అనేదే. మొన్నటి ఎన్నికల్లో ఎనిమిది ఎంపీలు గెలిచిన తర్వాత.. ఆ పార్టీ ఫుల్ ఫోకస్ చేస్తుందనుకున్నారు అంతా. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఒక్క స్థానం దక్కించుకోకపోగా.. ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీ మారుతున్నారు. ఈ క్రమంలో ఆ స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తుందనుకున్నారు అంతా.


కానీ ఎన్ని మంచి అవకాశాలు వచ్చినా బీజేపీ రాష్ట్ర నాయకత్వం సరిగా స్పందించడం లేదు. దీంతో పార్టీ క్యాడరే అధినాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన తెలంగాణ, ఆంధ్రా వ్యాఖ్యలు ఇప్పుడు పెద్డ దుమారమే రేపుతున్నాయి. కాస్త ఆలస్యంగా అయినా కాంగ్రెస్ రియాక్ట్ అయినా బీజేపీ మాత్రం మౌనంగా ఉండటం తీవ్ర చర్చనీయాశం అయింది.


అధికారంలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి పట్టు లేదు అన్నది ఓపెన్ సీక్రెట్. కానీ బీజేపీకి అలా కాదు. ఆ పార్టీకి నగరం అంతటా కార్పొరేటర్లు ఉన్నారు. బీఆర్ఎస్ కు చెమటలు పట్టించేలా గత గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ఫలితాలు రాబట్టింది. పైగా మరో ఏడాదిన్నరలో మళ్లీ గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ ఇచ్చిన పదునైన అస్త్రాన్ని బీజేపీ అందిపుచ్చుకోవడంలో విఫలం అవుతోందని విమర్శకుల వాదన.


బీఆర్ఎస్ ను దెబ్బతీస్తూ గ్రేటర్ లో ఎదిగేందుకు ఇదో మంచి అవకాశం. కేసీఆర్ ను ప్రశ్నిస్తూ.. కాంగ్రెస్ సైలెన్స్ ను హైలెట్ చేస్తూ.. బీజేపీ పొలిటకల్ స్టాండ్ తీసుకునే పరిస్థితి లేదు. ఇలా తీసుకుంటే పరిస్థితి మరోలా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చిన్న చిన్న అంశాలకే స్పందించే బండి సంజయ్ లాంటి నేతలు.. ఈ ఇష్యూ జోలికి రావడం లేదు. దీంతో కారణం ఏమై  ఉంటుందా అనే సందేహాలు అటు కమల దళంతో పాటు రాజకీయ వర్గాల్లో వస్తోంది. సెటిలర్ల ఓట్లతో గెలిచి, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్న ఈటల రాజేందర్ సైతం మౌనంగా ఉండటం దేనికి సంకేతం అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మంచి అవకాశాన్ని బీజేపీ చేజార్చుకోంది అనే చర్చ జోరుగా సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp