ట్రాన్స్ జెండర్లు.. ఇటు స్త్రీలుగా.. అటు పురుషులుగా కాకుండా మూడో రకంగా సమాజంలో జీవనం సాగిస్తున్నారు. వీరిని సమాజం ఇంకా అంగీకరించడం లేదు. హేళన చేస్తోంది. అవకాశాలు కల్పించడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వాలే వారి కోసం చొరవ చూపుతున్నాయి. అందుకే అప్పుడప్పుడు వారు ఆయా రంగాల్లో నిలదొక్కుకుంటున్నారు. డాక్టర్లుగా.. రాజకీయ నేతలుగా, ఉద్యోగులుగా, ఐపీఎస్ లుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.


సమాజంలో ట్రాన్స్ జెండర్ల సంఖ్య తక్కువే అయినా.. వారికి పని కల్పించే వారు లేకపోవడంతో చాలా మంది భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఉత్సవాలు, వేడుకల్లో పాల్గొంటూ ఆశీర్వదిస్తూ ఆదాయం పొందుతున్నారు. అయితే ఇలాంటి వారికి కూడా ఉపాధి కల్పించాలన్న ఆలోచన చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ట్రాన్స్ జెండర్లు పెరుగుతున్నారు. జిల్లాల నుంచి బతుకు దెరువు కోసం రాజధాని చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని ట్రాఫిక్ వాలంటీర్లుగా నియమించే ఆలోచన చేయాలని సీఎం అధికారులకు సూచించారు.


రాజధాని హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ పౌర సేవల కోసం చేపట్టిన పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు హోం గార్డుల తరహాలో ట్రాన్స్ జెండర్లను వాలంటీర్లుగా నియమించే అవకాశం పరిశీలించాలని సీఎం సూచించారు. తద్వారా వారికి ఉపాధి కల్పించినట్లు అవుతుందని పేర్కొన్నారు. దీంతో వారికి ఉపాధి దొరుకుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.


ఇక మూసీ ప్రక్షాళనను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. నది ఆక్రమణ దారులు తరలించే పనులు త్వరగా చేపట్టాలన్నారు. నిర్వాసితులకు పునరావసం కల్పించాలని తెలిపారు. నగరంలో ఐదేళ్ల క్రితం సమగ్ర రహదారుల నిర్వహణ కింద 811 కి.మీ. రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. అయితే వాటి నిర్వహణను మాత్రం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ నియంత్రించే వాలంటీర్లుగా నియమించాలని సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: