దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్టయిన ఆరు నెలల తర్వాత సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక మీదట దిల్లీ సీఎంగా కేజ్రీవాల్ తన పాత్రను పూర్తిగా కొనసాగించలేకవచ్చు. ఎందుకంటే బెయిల్ షరతుల్లో సెక్రటేరియట్ లో విధులు నిర్వహించకూడదనే షరతు ఉంది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది. ఈ సమయంలో ఆయన జైలు నుంచి బయటకు రావడం పార్టీకి పెద్ద ఊరట.
కేజ్రీవాల్ బెయిల్ పై బయటకు రావడంతో ఆప్ అగ్రనేతలు అందరూ బయటకు వచ్చినట్లు అయింది. దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఎక్సైస్ పాలసీ కేసులో ఆరోపణలతో తీహాడ్ జైలులో గడిపారు. ఈ ఏడాది ప్రారంభంలో బెయిల్ పై విడుదల అయ్యారు. దిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ మాత్రమే కేజ్రీవాల్ సహాయకుడు. అదే కేసులో ఇప్పటికీ కటకటాల వెనుక ఉన్నారు.
అక్టోబరు 5న హరియాణాకి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ తో పొత్తుకు ఆప్ ప్రయత్నించినా చర్చలు సఫలం కాలేదు. దీంతో ఒంటరిగా బరిలో దిగాలని ఆప్ నిర్ణయించింది. ఇప్పుడు ఎన్నికల ముందు తమ నాయకుడు బయటకు రావడంతో ఆ పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గత నెల రోజులుగా కేజ్రీవాల్ భార్య సునీత, ఇతర పార్టీ నాయకులు హరియాణా అంతటా ప్రచారం చేస్తూ దిల్లీ సీఎం హరియాణాలో పుట్టారు. దిల్లీ మాదిరిగా విద్యా, వైద్యం, పౌర మౌలిక సదుపాయాలను మార్చాలనుకుంటున్నారు అని చెప్పారు.అదే సమయంలో మోదీ లిక్కర్ స్కాంలో ఇరికించారని ఆరోపిస్తూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ఇదే సమయంలో కేజ్రీవాల్ ప్రచారానికి రావడం తమకు సరికొత్త ఉత్సహాన్ని నింపుతుందని.. పార్టీ కార్యకర్తల్లో క్యాడర్ లో సరికొత్త జోష్ నింపుతుందని ఆ పార్టీ హరియాణా ఛీఫ్ సుశీల్ గుప్తా తెలిపారు. మరి ఎన్నికల్లో ఆయన ఏ మేర ప్రభావం చూపుతారో ఫలితాల రోజు తేలిపోనుంది.