అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల మద్దతు ఎవరికీ? సహజంగానే ఇండియన్ అమెరికన్ అయిన కమలా హారిస్ కి వారి సపోర్టుగా నిలుస్తారు. ఆ మద్దతు తనకు కావాలనుకుంటున్నారు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్..


ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో ఉన్నారు. ఆయన్ను కలిసేందుకు ట్రంప్ ఆసక్తి చూపుతున్నారు. ప్రధాని మోదీ మూడు రోజుల అమెరికా పర్యటనలో ఐక్య రాజ్య సమితి సర్వ ప్రతినిధి సభతో పాటు క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు ఆయన అమెరికా వెళ్తున్నారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ అమెరికాలో ప్రధాని పర్యటన షెడ్యూల్ ని ప్రకటించింది. ఈ నెల 21న క్వాడ్ సదస్సు హాజరు కానున్నారు. ఈ నెల 22న న్యూయార్క్ లో ప్రవాస భారతీయులతో సమావేశంలో పాల్గొంటారు. ఈ నెల 23న ఐక్య రాజ్య సమితి సభ నిర్వహించే సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ కు హాజరు అవుతారు. ఇది క్లుప్తంగా మోదీ షెడ్యూల్.


అయితే ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. డెమొక్రటిక్ అభ్యర్థిగా బైడెన్ తప్పుకోవడంతో పోటీ మరింత పెరిగింది. ఆయన స్థానంలో బరిలో నిలిచిన కమలా హారిస్ కే విజయావకాశాలు ఉన్నాయని పలు సర్వే సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరుస దాడులతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటున్న ట్రంప్ సానుభూతి ఓట్లతో గట్టెక్కుతాను అని నమ్ముతున్నారు.


ఇక ఇండియన్ మూలాలు ఉన్న కమలా హారిస్ కే ఇండో అమెరికన్ ఓట్లు గంపగుత్తుగా పడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ట్రంప్ గెలవాలంటే ఈ ఓట్లు కూడా కీలకం. ఈ నేపథ్యంలో ట్రంప్ ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకుండా ఈ ఓటర్లను ఆకర్షించేందుకు అమెరికా పర్యటనకు వెళ్తున్న ప్రధాని మోదీని కలిసేందుకు ఎదురు చూస్తున్నారు. మోదీతో సమావేశం తనకు మైలేజ్ ఇస్తుందని ఆశిస్తున్నారు. అయితే ఒకవేళ సమావేశం అయితే ట్రంప్ కు ఎంత మేర కలిసి వస్తుందో చూడాలి.




 

మరింత సమాచారం తెలుసుకోండి: