ఏపీలో ప్రస్తుతం ఎవరు పార్టీ మారినా.. చివరకు చేరేది జనసేనలోకేనా.. వలస నేతలంతా చలో జనసేన అనడానికి కారణం ఏంటి? కుప్పలు తెప్పలుగా నేతలు వస్తున్నా జనసేన మాత్రం ఒకరిద్దరికే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. మిగిలిన వారికి వెయిటింగ్ లో ఎందుకు పెడుతోంది. పార్టీలో కొత్తగా వస్తామంటున్న నేతలపై జనసైనికుల అభ్యంతరాలు ఉన్నాయా? ఇంతకీ చేరికలపై పవన్ వైఖరేంటి?
రాజకీయ పార్టీల్లో చేరికలు.. రాజీనామాలు చాలా కామన్. కానీ జనసేనలో చేరికలు మాత్రం ప్రస్తుతం డిఫరెంట్ గా చూస్తున్నారు విశ్లేషకులు. ఏ పార్టీలో అయినా ఎన్నికల ముందు చేరికలు ఉంటాయి. అవకాశాల కోసం.. ప్రత్యామ్నాయాల కోసం నేతలు ఒక పార్టీ నుంచి మరొక పార్టీ మారుతుంటారు. కానీ ఇప్పుడు ఏపీలో జనసేనలోకి చేరికలు చాలా డిఫరెంట్ గా సాగుతున్నాయి. ఎన్నికలు జరిగి.. ప్రభుత్వ ఏర్పడిన వంద రోజులకే చలో జనసేన అంటూ వలస నేతలు నినదిస్తున్నారు.
అయితే ఈ చేరికలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది వైసీపీ నాయకులు జనసేనలోకి రావాలని ప్రయత్నిస్తున్నా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ విప్ సామినేని ఉదయభానుకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మిగతా వైసీపీ నేతలకు అపాయిట్ మెంట్ కూడా ఇవ్వడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో జనసేనలో తమకు తెలిసిన నేతల ద్వారా పవన్ కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
జనసేనలో చాలా నియోజకవర్గాలకు ఎమ్మెల్యే స్థాయి నాయకులు లేరన్న వాదన ఉంది. కానీ ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఈ విషయం గత ఎన్నికల్లో రుజువైంది. ఇలాంటి చోట చేరికలకు ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ యోచిస్తున్నారు. ఇదే సమయంలో ప్రజారాజ్యం పార్టీలో ఎదురైన అనుభవాలను డిప్యూటీ సీఎం ను అప్రమత్తం చేస్తున్నాయి. అప్పట్లో చాలా మంది కోవర్టులగా పనిచేయడంతో ప్రజా రాజ్యం దెబ్బతిందని గతంలో స్వయంగా చెప్పిన పవన్.. ఇప్పుడు వచ్చిన వారు వైసీపీ కోవర్టులా కాదా అనే విషయంపై పూర్తి స్థాయి సమాచారం తెప్పించుకొని.. ఆరా తీసిన తర్వాతే ఓకే చెబుతున్నారు. మొత్తానికి వచ్చిన నేతలన్ని వచ్చినట్లు కాకుండా వడపోసి తీసుకోవాలని పవన్ భావిస్తున్నారు.