కొన్నేళ్లుగా భారత్- పాకిస్థాన్ మధ్య విభేదాలు తలెత్తినప్పుడల్లా ఉగ్రవాద దాడులు జరిగినప్పుడల్లా ప్రస్తావనకు వస్తుంది సింధు నదీ జలాల ఒప్పందం. దీనిని రద్దు చేసుకోవాలంటూ భారత్ నుంచి గట్టి డిమాండ్లు వస్తుంటాయి. ఇప్పుడు అప్పుడు కాదు.. దాదాపు 65 ఏళ్ల క్రితం కుదిరిన ఈ ఒప్పందం వాస్తవానికి నదీ జలాల అంతర్జాతీయ పంపకానికి ఒక విజయవంతమైన ఉదాహరణ.
అయితే దీని తర్వాత రెండు సార్లు పాక్- భారత్ యుద్ధం జరిగింది. ఒకసారి బంగ్లాదేశ్ దేశమే ఆవిర్భవించింది. మరోసారి కార్గిల్ చొరబాట్లు బయట పడ్డాయి. కానీ ఒప్పందం మాత్రం రద్దు కాలేదు. అందుకే దీనిని విజయవంతమైన ఒప్పందంగా చెబుతుంటారు. కొన్నేళ్లుగా పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుంది. ఆపై వరదలతో సతమతం అవుతుంది. ఉగ్రవాదం, ధరల పెరుగుదల వంటి మిగతా కష్టాలు ఉండనే ఉన్నాయి. అయితే.. ఇప్పుడు భారత్ ఈ పరిస్థితులపై పుండు కారం మీద చల్లేలా ఉంది. సింధు నదీ జలాల ఒప్పందంపై సమీక్ష కోరుతోంది. వాస్తవానికి దీని నుంచి తప్పించుకునేందుకు ఒక అవకాశం ఉంది. పాకిస్థాన్ తమకు వ్యతిరేకంగా ఉగ్రవాద గ్రూపులను ప్రోత్సహిస్తోందని చెబుతూ తప్పుకోవచ్చు. మౌలిక పరిస్థితుల్లో మార్పులు ఉంటే.. ఏ ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చని అంతర్జాతీయ న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనిని సాకుగా చెబుతూ సింధు నదీ జలాల ఒప్పందం నుంచి వైదొలగొచ్చు.
సింధు నది జలాల ఒప్పందం తొమ్మిదేళ్ల చర్పోచర్చల తర్వాత 1960 సెప్టెంబరు 19న కుదిరింది. సింధు నది పరివాహక ప్రాంతం 11.2 లక్షల కిలోమీటర్లు. పాక్ లో 47 శాతం, భారత్ లోని 39 శాతం ప్రవహిస్తోంది. చైనాలో 8 శాతం, ఆఫ్గాన్ లో 6 శాతం పారుతుంది. కాగా రెండేళ్ల క్రితం కూడా ఈ ఒప్పందంపై చర్చలు జరిగాయి. మళ్లీ ఇప్పుడు భారత్ మరోసారి పాక్ కు లేఖ రాసింది. పరిస్థితుల్లో సమూల మార్పులు సింధు జలాల పంపిణీ ఒప్పందాన్ని సమీక్షించక తప్పదని నోటీసు ఇచ్చింది. గత నెల 30నే పాక్ కు ఈ నోటీసు జారీ చేసింది. పాకిస్థాన్ లో సింధు నది ద్వారా 17 లక్షల ఎకరాల్లో వ్యవసాయం దెబ్బతింది. ఇదీ సింధు జలాల ఒప్పందం రద్దుకు భారత్ చేస్తున్న డిమాండ్ వెనుక అసలు ఉద్దేశం.