తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. లడ్డూ ప్రసాదం వినియోగంలో కల్తీ నెయ్యి వాడారని.. బాధ్యులైన కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నాయకులంతా డిమాండ్ చేస్తున్నారు. తిరుమల పవిత్రతను దెబ్బ తీశారంటూ.. మాజీ సీఎం జగన్ పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.


దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. సమగ్ర విచారణ జరపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై స్పందించిన రాజకీయ పార్టీ ఉండదంటే అతిశయోక్తి లేదేమో.


ఇక ప్రతి పక్ష నేత రాహుల్ గాంధీ కూడా లడ్డూ ప్రసాదంపై వివాదంపై సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు మనోభావాలు దెబ్బతీసిన ఈ సంఘటనకు బాధ్యులను విడిపించేందుకు వీల్దేదన్నారు. అయితే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లడ్డూ వివాదంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం స్పందించడం లేదు. ఇక ఇదే సమయంలో ఆ పార్టీ ముఖ్య నేతలు కూడా దీని గురించి మాట్లాడేందుకు ముందుకు రావడం లేదు.


సమయం అంతా కాకపోయినా… సందర్భం లేకపోయినా అధికారంలో ఉన్నంత కాలం నా కంటే పెద్ద హిందువు ఎవరు ఉన్నారు అంటూ ప్రకటనలు చేసిన కేసీఆర్.. ఈ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. లడ్డూ ప్రసాదం విషయం ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్. సోషల్ మీడియా, ప్రాంతీయ, జాతీయ మీడియాలో ఇప్పుడు దీని గురించే చర్చంతా నడుస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రముఖులు, రాజకీయ పార్టీల నాయకులు దీనిపై స్పందిస్తున్నారు.


కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం నోరెత్తడం లేదు. ఇక ఇదిలా ఉండగా.. కేసీఆర్, జగన్ ల మధ్య రాజకీయ స్నేహ బంధం గురించి అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల్లో జగన్ విజయం సాధించి ఏపీలో అధికారం చేపట్టడానికి కేసీఆర్ కూడా తన వంతు సాయం అందించారు అని విశ్లేషకులు చెబుతుంటారు. అలాగే 2024 లోక్ సభ ఎన్నికల ప్రచారంలోను జగన్ గెలవబోతున్నారు అంటూ మీడియా ముఖంగా సెలవిచ్చారు. ఏది ఎలా ఉన్నా ప్రస్తుత హాట్ టాపిక్ అయిన లడ్డూ విషయంలో ఏదో ఒకటి స్పందిస్తేనే మేలని విశ్లేషకులు సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: