దగ్గర దగ్గరగా తెలంగాణ రాష్ట్ర సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి ఏడాది అవుతోంది. మరో రెండు నెలల్లో సీఎంగా ఏడాది పూర్తి చేసిన వారు అవుతారు. ఇప్పటి వరకు పాలన మీదా.. తాను సీఎంగా కుదురుకోవడం మీదనే ఫోకస్ చేసిన ఆయన… ఇప్పుడు ఎమ్మెల్యేల మీద దృష్టి పెట్టారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకు తగ్గట్లే తనదైన శైలిలో సింపుల్ వార్నింగ్ ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.


ఇటీవల టీపీసీసీ కొత్త రథసారధిగా ఎంపికైన మహేశ్ కుమార్ గౌడ్ ను సన్మానించేందుకు హైదరాబాద్ మహా నగరంలో ఒక స్టార్ హోటల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్టాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.  మన ఎమ్మెల్యేలు బాధ్యతతో మెలగాలి. అవినీతికి దూరంగా ఉండాలి. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల బదిలీలు.. ఇతర విషయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకోవడంతో వారిని ప్రజలు ఓడించారు.


మన ఎమ్మెల్యేలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎమ్మెల్యేలు సచివాలయానికి గుంపులు గుంపులుగా రావొద్దు. క్షేత్ర స్థాయిలో  ప్రజలకు అందుబాటులో ఉండండి. పని చేయండి. అప్పుడే వారు మరోసారి మనల్ని గెలిపిస్తారు. అని వ్యాఖ్యానించడం గమనార్హం.


పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని.. వారంతా జాగ్రత్తగా ఉండాలన్న సీఎం రేవంత్ .. ప్రతి ఎమ్మెల్యే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు నియోజకవర్గ ప్రజలను కలిసేందుకు సమయాన్ని కేటాయించాలని సూచించారు. బీసీ జనగణన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.


త్వరలో ప్రతి కుటుంబానికి హెల్త్ కార్డులు అందజేస్తాం. ఈ కార్డు ఆధారంగానే సదరు కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతాయి అని పేర్కొన్నారు. రేవంత్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తున్నా.. ఇప్పటి వరకు ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శల్ని తిప్పే కొట్టే విధంగా కాంగ్రెస్ నేతలు పని చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా ఆ అంశాన్ని రేవంత్ ప్రస్తావించడం విశేషం. ప్రతిపక్షాలను తిప్పికొట్టేందుకు సన్నద్దంగా ఉండాలి. పార్టీలో కష్టపడి పనిచేస్తేనే గుర్తింపు ఉంటుంది. పదవులు వస్తాయి అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: