గులాబీ తెగులకు సన్ ట్రీట్ మెంట్ ఇవ్వాలనుకుంటున్నారా? మళ్లీ వికసించి పరిమళాలు గుభాళించాలంటే.. ఉదయించే సూర్యుడే దిక్కని భావిస్తున్నారా? అందుకే బీఆర్ఎస్ అధిష్ఠానం తమిళనాడు వైపు చూస్తోందా? కేడర్ కు బూస్ట్ ఇవ్వడానికి కారుకు సిక్స్ గేర్ వేయడానికి అదొక్కటే మార్గం అని బీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారా?


తెలంగాణ భవన్ వర్గాలు అసలెందుకు అన్నా ఆరివాలాయం వైపు చూస్తున్నాయా? అక్కడి నుంచి ఏం నేర్చుకోవాలనుకుంటున్నారా? అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పరాజయం, పార్టీ చరిత్రలో తొలిసారి లోక్ సభలో ప్రాతినిథ్యం లేకుండా పోయింది. అసలు అధినేత  ముందు చెప్పిన ప్లాన్స్ అన్నీ తలకిందులు అవడంతో బీఆర్ఎస్ అంతర్మథనం తీవ్రంగానే ఉంది. అన్నింటికి మించి ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు వలసలతో కేడర్ లో నైతిక స్థైర్యం దెబ్బతిందని గ్రహించిన అధిష్ఠానం.. దాన్ని పునరుద్ధరించడానికి చేయాల్సిన పనులు చేస్తూనే.. అంతకు మించిన కార్యాచరణపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 


పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అంతకు ముందు ఉద్యమ పార్టీగా ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక అజెండాగా ఊపిరి పోసుకుని ఆ టార్గెట్ చేరుకోవడంలో విజయవంతం అయింది.  కానీ పార్టీ పెట్టి పాతికేళ్లు కావొస్తున్నా ఇంత వరకు సంస్థాగత నిర్మాణం సరిగ్గా జరగలేదు. దీంతో ఆ లోటు ఇప్పుడు తెలిసి వస్తుందన్న చర్చ జరుగుతోంది. ఉద్యమంలో ఉన్పప్పుడు  పవర్ వచ్చాక ఆ లోటు తెలియకున్నా.. ఇప్పుడిప్పుడే తత్వం బోధపడుతుంది.


అందుకే సంస్థాగత నిర్మాణం బలంగా ఉన్న డీఎంకే లాంటి పార్టీల నిర్వహణపై దృష్టి సారించాలని బీఆర్ఎస్ పెద్దలు ఆలోచన చేశారు. తమిళనాడులో ద్రవిడ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ డీఎంకే. సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటూ పడ్డ ప్రతీసారి రెట్టింపు వేగంతో పైకి లేచింది. ఇప్పుడు కూడా రకరకాల కోణాల్లో ఆ పార్టీ అనుసరించే వ్యూహాలతో పాటు పాలసీలను అధ్యయనం చేసి.. వాటిని మన రాష్ట్రానికి తగ్గట్లు మార్చుకొని ముందడుగు వేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మరి ఏ మేర విజయంతం అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs