తిరుమల లడ్డూ వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా తిరుమలలో లడ్డూ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై విచారణ చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. తాజాగా సుప్రీం కోర్టు ఈ కేసు విచారణపై కీలక నిర్ణయం తీసుకుంది.


తిరుమల లడ్డూ వివాదం సర్వోన్న న్యాయస్థానానికి చేరింది. ఈ వివాదంలో నిజం నిగ్గు తేల్చేందుకు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని వైసీపీ రాజ్య సభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో లడ్డూ వివాదంలో వాస్తవాలు తేల్చేందుకు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సైతం మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఈ రెండు పిటిషన్లపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.


తిరుమల లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లనను విచారించేందుకు సుప్రీం కోర్టు బెంచ్ ని నిర్ణయించింది. జస్టిస్ బీ.ఆర్. గవాయి, జస్టిస్ కేవీ విశ్వ నాథన్ బెంచ్ కి ఈ కేసును కేటాయించారు. ఈ నెల 30న సుప్రీం కోర్టు ఈ కేసును విచారించనుంది. ఆ రోజున విచారించే కాజు లిస్టులో ఐదో నెంబర్ 63గా తిరుమల లడ్డూ కేసు లిస్ట్ అయింది. సుబ్రహ్మణ్య స్వామి ఈ కేసులో స్వయంగా తన వాదనలు వినిపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వివాదంపై రాజకీయంగా పెద్ద ఎత్తున రగడ కొనసాగుతోంది.


ఏపీ ప్రభుత్వం లడ్డూ వివాదంపై ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసింది. ఈ రోజు నుంచి తిరుమలలో సిట్ విచారణ బృందం ప్రారంభిస్తోంది. అటు ప్రతిపక్ష వైసీపీ.. లడ్డూ కలుషితం అనేది రాజకీయ ప్రేరేపిత కుట్రగా ఆరోపిస్తుంది. ఇప్పటికే ఈ వివాదంపై జగన్ ప్రధాని, సుప్రీం కోర్టు సీజేకు లేఖలు రాశారు. దీంతో ఇప్పుడు సుప్రీం కోర్టు లో ఈ కేసు విచారణ వేల జరిగే పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. విచారణకు సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది కీలకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: