జగన్ ఎందుకు తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు? ఆయన చెబుతున్నట్లు పోలీసులు నోటీసులు ఇచ్చారా? లేకుంటే డిక్లరేషన్ ఇచ్చేందుకు జగన్ భయపడ్డారా? లేనిపోని సమస్యలను కొన్ని తెచ్చుకోవడం ఎందుకని భావించారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో ఇదే ఆసక్తికర చర్చ నడుస్తోంది.  మధ్యాహ్నం వరకు జగన్ పర్యటన ఉంటుందని చెప్పిన వైసీపీ శ్రేణులు హడావుడి చేశారు. ఎప్పుడైతే టీటీడీ అధికారులు డిక్లరేషన్ నిబంధన పెట్టారో అప్పుడే జగన్ పునరాలోచనలో పడినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


డిక్లరేషన్ అనేది ప్రాణ సంకటంగా మారిపోయిందని చెబుతున్నారు. నేను అన్య మతస్తుడిని అయినా.. తిరుమల శ్రీవారిపై విశ్వాసం ఉంది అని డిక్లరేషన్ పై సంతకం చేయాల్సి ఉంటుంది. దీనిపై సంతకం పెడితే తనకు తాను ఇబ్బందుల్లో పడినట్టేనని జగన్ కు తెలుసు. అందుకే ఆయన వెనక్కి తగ్గారని.. తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని తెలుస్తోంది.


ఒకవేళ తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటే జగన్ ఆ డిక్లరేషన్ పై సంతకం చేస్తే రెండు విషయాలు బయటపడతాయి. ఒకటి తాను హిందువును కాదని.. ఆయన స్వయంగా ఒప్పుకున్నట్లు అవుతుంది. నిజానికి ఇప్పటి వరకు జగన్ చర్చిలకు వెళ్లినా  ప్రత్యేక ప్రార్థనలు చేసినా తనకు తాను క్రిష్టియన్ అని ఎక్కడా చెప్పుకోలేదు. అలా అని హిందువు కాదని చెప్పలేదు. ఇలాంటి సమయంలో సంతకం చేస్తే తాను హిందువు కాదన్న విషయం స్వయంగా నిర్ధారించినట్లు అవుతుంది.


ఒకవేళ సంతకం చేస్తే బలమైన ఓటు బ్యాంకు వైసీపీకి దూరం అయ్యే అవకాశం ఉంది. వైసీపీకి ప్రధానంగా ఓటు బ్యాంకులో ఎస్సీ, ఎస్టీలు కీలకం. ఈ ఎన్నికల్లో ఘెర పరాజయం ఎదురైనా 40 శాతం ఓటింగ్ రావడానికి వారే ప్రధాన కారణం. పొరపాటున సంతకం చేస్తే ఆ వర్గాల్లో క్రిష్టియన్ ఓట్లు దూరం అవుతాయి. అదే సమయంలో తిరుపతి వెళ్లే హిందువులు హర్ట్ అవుతారు. ఇప్పటికే వైసీపీపై హిందువుల్లో ఒక రకమైన భావన వ్యక్తం అవుతోంది. ఇప్పుడు డిక్లరేషన్ వివాదం ముదిరితే మిగతావారు కూడా దూరం అయ్యే అవకాశం ఉంది. అందుకే జగన్ చంద్రబాబుకి ఆ అవకాశం ఇవ్వకుండా వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గారని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: