తిరుమల వ్యవహారంలో ఏపీ బీజేపీ నేతలు పెద్దగా మాట్లాడటం లేదు. పొరుగున ఉన్న తెలంగాణ నేతలు శరవేగంగా స్పందించారు. వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో జగన్ సైతం అదే గుర్తు చేశారు. తనను తిట్టించడానికి తెలంగాణ బీజేపీ నేతల్ని తీసుకువచ్చారని మండిపడ్డారు. తద్వారా ఏపీ బీజేపీ నేతల పాత్ర ఏంటి అనేది ఇప్పుడు అందరిలో తలెత్తుతున్న ప్రశ్న.
ఎన్నికల ముందు నుంచి బీజేపీ చాలామంది సీనియర్లు సైలెంట్ అయిపోయారు. తెలుగుదేశంతో పొత్తును ఈ సీనియర్లంతా వ్యతిరేకించారు. దీంతో ఈ ఎన్నికల్లో పొత్తు కుదరడంతో వారికి టికెట్లు దక్కలేదు. ఎవరైతే టీడీపీకి పొత్తుకు ఓకే అన్నారో వారందరికీ టికెట్లు దక్కాయి. పొత్తులో భాగంగా గెలిచారు కూడా. అయితే చాలాకాలంగా బీజేపీలొ ఉంటున్న నాయకులకు మాత్రం టికెట్లు దక్కలేదు.. దీంతో వారంతా సైలెంట్ అయిపోయారు. తాజాగా లడ్డూ వివాదంలో కూడా వీరెవరు కలుగజేసుకోవడం లేదు.
కానీ తెలంగాణ బీజేపీ నాయకులు మాత్రం ఈ ఘటనపై స్పందించారు.. బండి సంజయ్ లాంటి వారు బాహాటంగానే తప్పు పట్టారు. మరో నేత మాధవీ లత సైతం వైసీపీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. హైదరాబాద్ నుంచి వందేభారత్ రైల్లో భజన చేసుకుంటూ తిరుమలలో అడుగు పెట్టారు. జగన్ పై విరుచుకుపడ్డారు. దీంతో వైసీపీ నేతలు ఆమెను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు.
లడ్డూ వివాదం నేపథ్యంలో జాతీయ స్థాయిలో హిందూ ధార్మిక సంఘాలు స్పందించాయి. కానీ హిందుత్వాన్ని భుజంపై వేసుకునే బీజేపీ ఏపీ నేతలు మాత్రం ఆ స్థాయిలో మాట్లాడటం లేదు. కనీసం ఖండించడం కూడా లేదు. ఏపీ బీజేపీలో కొనసాగుతున్న మాజీ ప్రభుత్వ కార్యదర్శి ఐ వి ఆర్ కృష్ణయ్య అయితే.. నెయ్యి కల్తీని నమ్మలేదు అన్నట్లు మాట్లాడారు. సోము వీర్రాజు, జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు మీడియా ముందుకు వచ్చినట్లు ఎక్కడా కనిపించడం లేదు. ఇదిలా ఉండగా.. లడ్డూ వివాదం నేపథ్యంలో పురంధేశ్వరితో పాటు గెలిచిన నాయకులు వైసీపీని తప్పు పట్టారు. కానీ జగన్ వారిని పరిగణనలోకి తీసుకోకపోవడం విశేషం.