ఏపీలో రాజకీయ నాయకుల నోళ్లకు ఉన్నట్టుండి మూత పడ్డాయి. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని పది రోజులుగా నానా యాగీ చేశారు. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. జనమంతా నాయకులు మాటలు విని నవ్వాలో ఏడ్వాలో కాక తలలు పట్టుకున్నారు. నిజంగా లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారా? అవే లడ్డూలను మనం తిన్నామా? అంటూ ఊరువాడా చర్చించుకున్నారు.


తాజాగా దీనిపై విచారణ చేపట్టిన దేశ సర్వోన్నత న్యాయస్థానం పలు అంశాలను లేవనెత్తింది. దేవుడిని రాజకీయాలకు వాడుకుంటారా అంటూ వ్యాఖ్యానించింది. దీంతో అన్ని పార్టీలు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాయి. హిందూ సంఘాల ఘెరం అంటూ మాట్లాడిన మాటు ఒక్కసారిగా ఆపివేశాయి.


తెలుగు దేశం నోరు మెదపలేదు. వైసీపీ నేతలు సోమవారం ఉదయం మాట్లాడిన తర్వాత అధినేత ఆదేశాల మేరకు నోటికి తాళం వేశారు. లడ్డూ వ్యవహారంపై ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. ప్రభుత్వ దర్యాప్తు నిలిచిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అందరూ అక్టోబరు 3వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. సుప్రీం కోర్టులో తిరిగి దీనిపై విచారణ జరగనుంది.


అయితే లడ్డూ వివాదం వ్యవహారంపై కోట్ల మంది భక్తుల అభిప్రాయాలు మనోభావాలు ఆధారపడి ఉన్నాయి.   కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశ విదేశాల్లో సైతం వేంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు. అలాంటిది ఒక్కసారిగా తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వాడారనే సరికి వారంతా ఆందోళనకు గురయ్యారు. వాస్తవానికి ఇలాంటి సెంటిమెంట్ అంశాలను పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత దోషులను గుర్తించి శిక్షలు వేస్తే బాగుంటుందని విశ్లేషకులు అంటున్నారు.


ఏమీ తేల్చకుండానే కేవలం ఆరోపణలు చేసి భక్తుల మనో భావాలు దెబ్బతీస్తున్నారని కూడా అభిప్రాయపడుతున్నారు. సుప్రీం కోర్టు ఇదే విషయాన్ని వ్యక్తీకరించింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు చెప్పడానికి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా.. సిట్ దర్యాప్తు నివేదిక రాకముందే మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఏముంది.. రాజకీయాల నుంచి కనీసం దేవుళ్లను పక్కన పెట్టాలి కదా అని సుప్రీం కోర్టు పలు ప్రశ్నలను సంధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: