అనుకున్నది ఒకటి.. అయినది ఒకటి.. అన్నట్లు మారింది బీఆర్ఎస్ పరిస్థితి. తెలంగాణ హ్యాట్రిక్ విజయం ఖాయమనే ధీమాతో పార్టీ పేరును మార్చి దేశ వ్యాప్తంగా విస్తరించాలని ప్లాన్ వేసి చతికిలపడింది బీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి మహారాష్ట్ర, ఒడిశా, ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాలను షురూ చేశారు.
రాష్ట్ర అధ్యక్షులను కూడా చకచకా నియమించేశారు. అంతలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనూహ్యంగా ఓటమి పాలైంది. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లోను ఆ పార్టీకి ఘెర అవమానమే జరిగింది. 17 చోట్ల పోటీ చేస్తే కనీసం ఒక్క స్థానంలోను గెలవలేదు. దీంతో ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ విస్తరణకు బ్రేకులు పడ్డాయి.
సొంత రాష్ట్రంలో అనూహ్యంగా ఓటమి పాలవ్వడంతో కేసీఆర్ కు అవమానంగా ఫీల్ అవుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచడమే కాకుండా కేడర్ కు సైతం దూరం అయ్యారనే విమర్శలు ఉన్నాయి. కేసీఆర్ సైతం సైలెన్స్ కావడంతో బీఆర్ఎస్ లో నిస్తేజం నెలకొంది. ఇక ఏపీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మినహా మిగిలిన నేతలంతా ఎన్నికల సమయంలో జంప్ చేయగా.. ఇప్పుడు మహారాష్ట్ర లో కూడా బీఆర్ఎస్ ఖాళీ అవ్వనున్నట్లు తెలుస్తోంది.
మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహారాష్ట్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మాజిక్ రావు సహా పార్టీ నేతలు ఎన్సీపీ నేత శరత్ పవార్ ను కలిశారు. దీంతో ఎన్సీపీలో బీఆర్ఎస్ విలీనం కానుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అక్టోబరు 6న పుణేలో ఎన్సీపీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో ఈ నేతలంతా ఎన్సీపీ తీర్థం పుచ్చుకుంటారనే అక్కడి నాయకులు చెబుతున్నారు. మరి ఇది జరుగుతుందో లేదో చూడాలి. అయితే బీఆర్ఎస్ ను దేశ వ్యాప్తంగా విస్త్రృతం చేయాలని భావించిన కేసీఆర్ కు మహారాష్ట్ర ఇష్యూ షాక్ ఇచ్చిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.