రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి సెగ తగులుతోంది. ఇది ఎవరు అవునన్నా.. కాదన్నా వాస్తవం. ముఖ్యంగా యువత నుంచి భారీ వ్యతిరేకత పెరుగుతుండటం గమనార్హం. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పిన చంద్రబాబు.. దానిని ఇప్పటి వరకు నాన్చుతూనే ఉన్నారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించే విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.


మరోవైపు.. వారిగి గత నాలుగు మాసాలుగా జీతాలు కూడా రాలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 1.3 లక్షల మంది వాలంటీర్లు ఆవేదనలో ఉన్నారు. తమకు ఉపాధి కల్పిస్తారా? లేదా? అని వారు ఎదురు చూస్తున్నారు. అంతే కాదు.. కలెక్టరేట్ల ముందు ధర్నాలు కూడా చేస్తున్నారు. ఒకవైపు ఉద్యోగాల కల్పన అంటూనే మరోవైపు ఉన్న ఉద్యోగాలను తీసేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక ఇప్పుడు మరో రెండు సమస్యలు తెరపైకి వచ్చాయి.


ఈ నెల 12 నుంచి కొత్త మద్యం విధానం అందుబాటులోకి రానుంది. దీని ప్రకారం.. ఇప్పటి వరకు సర్కారు అధీనంలో ఉన్న వైన్స్ షాపులను ప్రైవేటుకు అప్పగిస్తారు. దీంతో గత ఐదేళ్లుగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పని చేస్తున్న 60 వేల మందికి పైగా యువత భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నలు అలుముకున్నాయి. తమకు ప్రత్యామ్నాయ ఉద్యోగం, ఉపాధి చూపాలని వారు పట్టుబడుతున్నారు.


దీంతో సుమారు 60 వేల మందికి పైగా మద్యం దుకాణాల్లో సూపర్ వైజర్లుగా పనిచేసిన వారు, బాయ్ లుగా పనిచేసిన వారు కూడా ఉద్యమ బాట పడుతున్నారు. ఇక రెండో కీలక అంశం.. రేషన్ దుకాణాలు, ఇంటింటికీ పంపుతున్న రేషన్ వాహనాలను ఆధారంగా చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 67 వేల మంది డ్రైవర్లు, మరో 67 వేల మంది సహాయకులు ఉన్నారు. ఇప్పుడు వాహనాలు ఎత్తేస్తే తమ పరిస్థితి ఏంటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా చూస్తే..కూటమి సర్కారుకు నలు దిశలా నుంచి సెగలు తగులుతుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: