ప్రస్తుతం తెలంగాణలో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. చెరువులు, కుంటలు సంరక్షణే ధ్యేయంగా రేవంత్ రెడ్డి సర్కారు తెచ్చినా హైడ్రా వరుస కూల్చివేతలతో దూకుడు కొనసాగిస్తోంది. చెరువులను, నాళాలను, కాలువలను ఆక్రమించి నిర్మాణాలు సాగించిన వారి భరతం పడుతోంది. తన తరతమ బేధం లేకుండా చెరవులను కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలను హైడ్రా కూలగొడుతోంది.
ఈ నేపథ్యంలో ఆంధ్రాలోను హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకురావాలనే యోచనలో అక్కడి ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఏపీలో నదులు, కాలువలు ఆక్రమించి చేసిన నిర్మాణాలును కూల్చివేస్తామని ఇప్పటికే ఏపీ పురపాలిక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ లో అక్రమ నిర్మాణాలను కూల్చి వేసేందుకు కార్యాచరణ ప్రణాళిక చేపడతామని మంత్రి నారాయణ వెల్లడించారు.
ముఖ్యంగా ఇటీవల బుడమేరు వరదలతో విజయవాడ సగం నీట మునిగింది. లక్షల మంది ప్రజలు కొన్ని రోజుల పాటు జలదిగ్భంధంలో చిక్కుకున్నారు. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం కూడా సంభవించింది. బుడమేరు కాలువను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడమే ఇందుకు కారణమని.. బుడమేరు ప్రవాహానికి తగిన మార్గం లేకుండా చేయడంతో భారీ వర్షాలకు అది ఉప్పొంగిందని అంటున్నారు. ఈ నీరు కాలువలోకి పోయే మార్గం లేక జనావాసాలను చుట్టుముట్టిందని తేలింది.
ఈ నేపథ్యంలో బుడమేరు నుంచే ఏపీ ప్రభుత్వం కూల్చివేతల పర్వాన్ని మొదలు పెట్టనుందని తెలుస్తోంది. ఇప్పటికే అధికారులు పరిశీలన కూడా చేశారు. బుడమేరు మొత్తం ఎన్ని కి.మీ. ఉంది.. ఎన్ని ఎకరాల్లో కబ్జాకు గురైంది.. అక్రమ నిర్మాణాలెన్నీ.. ఎంత మంది ప్రజలు నివసిస్తున్నారు వంటి వివరాలను అధికారులు సేకరించారు. వీటిని కూల్చివేస్తే ఎంత మంది నిర్వాసితులు అవుతారో కూడా నివేదిక రూపొందించారు.
ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి దారుణ పరిస్థితులు తలెత్తకుండా అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇప్పటికే బుడమేరు ప్రాంతంలో అక్రమ నిర్మాణాల్లో ఉంటున్నవారిని వేరే చోటుకి తరలిస్తారు అని తెలుస్తోంది. అప్పుడే తెలంగాణ మాదిరి సమస్యలు రావని ఏపీ ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తోంది.