ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నాలుగు నెలలు కావొస్తోంది. ఒక్కో పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ల మొత్తాన్ని పెంచి అందించింది. గత నాలుగు నెలలుగా విజయవంతంగా అందించగలిగింది. అన్న క్యాటీన్లను ప్రారంభించింది.


ఇక దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టనుంది. డీఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియపై కసరత్తు జరుగుతుంది. అందుకు సంబంధించి ఫైల్ పై ఇప్పటికే సీఎం చంద్రబాబు సంతకం చేశారు. మరోవైపు సంక్రాంతికి మరో కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పీ 4 పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. డ్వాక్రా సంఘాలకు తర్వలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ ప్రైజెస్ హోదా కల్పించడానికి కూడా సిద్ధపడుతున్నారు.


ఇప్పటికే డ్వాక్రా సంఘాలకు 10 లక్షల రూపాయలు రుణాలను ఇస్తున్నారు. వ్యక్తిగత రుణాల పరిమితిని రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచారు. ఇప్పుడు డ్వాక్రా సంఘాల మాదిరిగానే స్వచ్ఛ సేవకుల కోసం ప్రభుత్వం ఆలోచన చేస్తుండటం విశేషం.


వాస్తవానికి డ్వాక్రా సంఘాల ఏర్పాటు ఆలోచన కూడా చంద్రబాబుదే. 1999లో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. దీంతో మహిళల కోసం స్వయం ఉపాధి పథకాలు పెంచాలని భావించారు. అందులో భాగంగానే పురుడు పోసుకున్నదే డ్వాక్రా వ్యవస్థ. దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ఏపీని చూసి చాలా రాష్ట్రాలు డ్వాక్రా వ్యవస్థను ప్రవేశ పెట్టాయి. ఇప్పుడు తాజాగా చంద్రబాబు సర్కారు స్వచ్ఛ సేవకుల వ్యవస్థను ప్రవేశ పెట్టేందుకు ముందుకు రావడం విశేషం.


చంద్రబాబుది నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం. ఆయన మహిళల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. మహిళల అభిమానాన్ని చూరగొన్నారు. 1999 ఎన్నికల్లో మహిళలంతా అండగా నిలవడం వల్లే చంద్రబాబు అధికారంలోకి రాగలిగారు అన్నది విశ్లేషకులు అభిప్రాయం. ఈ ఎన్నికల్లో సైతం మహిళల కోసం సూపర్ సిక్స్ పథకాల్లో మహిళలకు అగ్ర తాంబూళం వేశారు. తల్లికి వందనం, ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నగదు సాయం వంటి పథకాలను పొందు పరిచారు. మరి తాజాగా ప్రవేశ పెడుతున్న స్వచ్చ సేవకుల వ్యవస్థ ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: