ఇప్పటికే గత పార్లమెంట్ ఎన్నికల్లో చేదు ఫలితాలను చూసిన బీజేపీకి.. నిన్నటి రెండు రాష్ట్రాల ఫలితాలు కొంత ఖేదం.. కొంచెం మోదం అన్నట్లుగా మిగిల్చాయి. పార్లమెంట్ ఫలితాల్లో 400 పైగా సీట్లు సాధించి తీరుతామని బీజేపీ నేతలు ప్రచారం చేసుకున్నా ఆ స్థాయిలో సీట్లు సాధించలేకపోయింది. చివరకు మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.


అయితే నిన్నటి హరియాణా, జమ్మూ కశ్మీర్ ఫలితాల్లో బీజేపీకి అనూహ్య ఫలితాలు వచ్చాయి. హరియాణాలో కాంగ్రెస్ గెలుపు గ్యారంటీ అని అన్ని సర్వేలు చెప్పాయి. కానీ బీజేపీకి ఊహించని ఫలితాలు వచ్చాయి. సింగిల్ లార్జెస్ట్ గా పార్టీగా అవతరించింది.  దీంతో హరియాణా రాష్ట్రంలో బీజేపీ సంబురాలు మిన్నంటాయి. కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న జమ్మూ కశ్మీర్ లో మాత్రం బీజేపీ ప్రభావం చూపలేకపోయింది. కారణాలు ఏమైనా బీజేపీకి జమ్మూ కశ్మీర్ ప్రజలు ఝలక్ ఇచ్చారు.


ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ముస్లిం, మైనార్టీల సంఖ్య అధికంగా ఉండటంతో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు అనేది అందిరకీ తెలిసిందే. వచ్చే ఏడాది మహారాష్ట్ర, జార్ఖండ్, దిల్లీలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే .. ఈ రాష్ట్రాల్లో బీజేపీ మీద పలు ఆరోపణలు ఉన్నాయి. అధికార దుర్వినియోగం, అతి రాజకీయం అనే అపవాదును ఆ పార్టీ మూటగట్టుకుంది. మరోవైపు దేశ రాజధాని అయిన దిల్లీలో బీజేపీ గెలిచి చాలా ఏళ్లు అయింది. ఇదే క్రమంలో కేజ్రీవాల్ అరెస్టు తో ఆ పార్టీ మరోసారి వ్యతిరేకతను మూటగట్టుకుంది.


ఇక మహారాష్ట్రకు వచ్చేసరికి శివసేన, ఎన్సీపీలను చీల్చింది బీజేపీ. వారి మధ్య పొగ పెట్టి ఎంత నష్టం చేసిందో అందరికీ తెలిసిందే. బిహార్ విషయంలో బీజేపీకి టెన్షన్ తప్పడం లేదు. నితీశ్ బీజేపీతో ఉన్నా ఎప్పుడు ఎలాంటి బాంబు పేల్చుతారో తెలియదు. ఇక జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ అరెస్టుతో ఆయనపై సానుభూతి పెరిగిందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ ఈ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ డీలా పడితే.. భవిష్యత్తులో కేంద్రంలో ఎదుర్కోబోయే పరిస్థితులను కూడా హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: