భారత దేశం గర్వించ దగ్గ వ్యక్తి.. వ్యాపారవేత్త రతన్ టాటా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. గొప్ప గొప్ప ఆలోచనలతో ఎన్నో కంపెనీలు స్థాపించి సక్సెస్ అయిన విలువలు కలిగిన వ్యాపారవేత్త. దేశాభివృద్ధిలో తన పాత్ర ఉండాలని నిత్యం తపించే మనిషి రతన్ టాటా. ఇక ఆయన ఆరోగ్యంపై నెట్టింట చర్చ జరిగిన సంగతి తెలిసిందే.


బిపీ లెవల్స్ బాగా పడిపోవడంతో రతన్ టాటా ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి వెళ్లారు. దీంతో ఆయన ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ మేరకు తాను ఆరోగ్యంగానే ఉన్నానని ప్రకటన సైతం విడుదల చేశారు.  ఆందోళన చెంద వద్దు అంటూనే.. ఇంతలోనే ఆరోగ్యం విషమించడంతో బుధవారం అర్ధరాత్రి సమయంలో తుది శ్వాస విడిచారు.  

 

రతన్ టాటా.. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జి టాటాకు ముని మనువడు. రతన్ టాటా 1937 డిసెంబరు 28న ముంబయి నగరంలో జన్మించాడు ఈయన తల్లిదండ్రుల పేర్లు సూనీ టాటా, నావల్ టాటా. రతన్ టాటా పుట్టిన పది సంవత్సరాల తర్వాత సూని, నావల్ ఇద్దరూ విడిపోయారు. దీంతో రతన్ తన నాయనమ్మ నవాజ్ భాయ్ టాటా వద్ద పెరిగారు. ముంబయి, సిమ్లా ప్రాంతాల్లో కొంత కాలం చదువుకున్నారు. అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. 1959లో తన విద్యను పూర్తి చేసుకొని.. పట్టా అందుకున్నారు.


2008లో అదే యూనివర్శిటీకి 50 మిలియన్ డాలర్లు విరాళం ఇచచారు. ఆ యూనివర్శిటీ చరిత్రలో అతిపెద్ద అంతర్జాతీయ దాతగా టాటా ఆవిర్భవించారు. ఇక ఆయన్ను కలియుగ దానకర్ణుడు అంటుంటారు. ఇతరులపై జాలి చూపండి అంటూ పలువురికి సూచించే ఆయన.. ఆ మాటలకు ఆజన్మాంతం కట్టుబడి ఉన్నారు. టాటా గ్రూప్ లాభాల్లో 60-65 శాతం నిధులను సామాజిక బాధ్యత కింద ఖర్చు చేస్తున్నారు. దేశంలో విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం ఆయన ఇప్పటి వరకు రూ.9 వేల కోట్లకు పైగానే విరాళం ఇచ్చారు. దేశంలో మరెవరూ ఇంత మొత్తంలో విరాళం ఇచ్చి ఉండరేమో. ఇక ముంబయి తాజ్ హోటల్ పై ఉగ్రవాదులు దాడులు జరిపిన సమయంలోను ముందుగానే టాటా స్పందించి విరాళం అందజేశారు. అలాంటి గొప్ప వ్యక్తిని భారత్ కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం.

మరింత సమాచారం తెలుసుకోండి: