చంద్రబాబుకు కేంద్రంలో పరపతి పెరిగిందా? బిజెపి పెద్దలు ఆయనను విశ్వసిస్తున్నారా? భవిష్యత్ రాజకీయాల కోసం బాబు అవసరమని భావిస్తున్నారా? అందుకే ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఐదేళ్లుగా చంద్రబాబు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు.  


జగన్ కు ఎనలేని ప్రాధాన్యమిస్తూ వచ్చిన బిజెపి పెద్దలు..చంద్రబాబును పట్టించుకోలేదు. గుణపాఠాలను నేర్చుకున్న చంద్రబాబు అదే బిజెపికి దగ్గరయ్యారు. బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. ఏపీలో అధికారంలోకి రాగలిగారు. కేంద్రంలో తన టిడిపి మద్దతుతో ఎన్డీఏ మూడోసారి అధికారానికి రావడానికి కారణమయ్యారు. అప్పటినుంచి చంద్రబాబుకు పరపతి పెరిగింది.  గత అనుభవాల దృష్ట్యా కేంద్ర పెద్దలతో చంద్రబాబు సఖ్యతగా మెలుగుతున్నారు.


తన రాజకీయ ప్రత్యర్థి జగన్ పతనాన్ని చంద్రబాబు కోరుకుంటున్నారు.  కేంద్ర పెద్దలు అభయం ఇచ్చినట్లు తెలుస్తోంది.  చంద్రబాబు కేంద్ర పెద్దల జపం పఠిస్తున్నారు.  జగన్ ను రాజకీయంగా అణచివేసేందుకు కేంద్ర పెద్దల సాయాన్ని చంద్రబాబు కోరినట్లు సమాచారం. అందుకు కేంద్ర పెద్దలు సానుకూలంగా స్పందించినట్లు కూడా తెలుస్తోంది.


వైసీపీ గడ్డు పరిస్థితుల్లో ఉంది.  ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది గుడ్ బై చెప్పారు. వరుసగా నేతలు పార్టీని వీడుతున్నారు. ఇంకోవైపు కేసులు చుట్టుముడుతున్నాయి. చాలామంది వైసీపీ నేతలు అరెస్టులు కూడా జరిగాయి. మరికొన్ని పాత కేసులు తెరపైకి వస్తుండడంతో కీలక నేతలు సైతం భయపడుతున్నారు. ఈ క్రమంలో కేంద్రం కానీ చంద్రబాబుకు అభయం ఇస్తే కొన్ని కీలక కేసులు ముందడుగు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసుతో పాటు వివేకానంద రెడ్డి హత్య కేసు తెరపైకి వచ్చే అవకాశం ఉంది.  తనను జైలు పాలు చేసిన జగన్ ను అంత ఈజీగా చంద్రబాబు వదలరు. ఈ విషయం జగన్ కు తెలియంది కాదు. రాష్ట్రంలో తనకున్న అధికారంతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా జగన్ పై ఉక్కు పాదం మోపే అవకాశం ఉంది.


పైగా నిన్ననే సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ హర్యానాలో ఎన్డీఏ పక్ష సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ కూడా బిజెపితో పాటు భాగస్వామ్య పార్టీల బలోపేతానికి తమ వంతు సహకారం అందిస్తామని కేంద్ర పెద్దలు అభయం ఇచ్చారు. ఈ తరుణంలోనే వైసీపీలో ఒక రకమైన కలవరం ప్రారంభం అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: