ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం కొత్తపలుకులో జగన్ సత్యహరిశ్చంద్రుడి వేషాన్ని విశ్లేషించారు. అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కొత్తగా ఏమీ లేవు. కానీ ఆయన ఏదో చెప్పాలనుకున్నారు.  జగన్ రెడ్డి మళ్లీ ప్రతిపక్షంలోనే ఉండటానికి సిద్ధమని ఎందుకన్నాడో.. వైసీపీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలేమిటో… వైఎస్ కుటుంబంలో జరుగుతున్న తాజా గొడవలేమిటో చెప్పాలనుకుని మరీ ఆగిపోయినట్లుగా కనిపిస్తోంది. మొత్తంగా అతుకుల బొంత లాగా ఈ వారం కొత్త పలుకు పత్రికలోకి వచ్చింది.


మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోవడానికి రెడీ అని జగన్.. ముఖ్య నేతల సమావేశంలో చెప్పారు. ఆ ముఖ్య నేతల్లో ఎవరు ఉన్నారంటే.. శ్యామల లాంటి వాళ్లు ఉన్నారు. చాలా మంది రాలేదు. ఆ సమావేశంలో జగన్ మరోసారి ప్రతిక్షంలో కూర్చుంటా అని ప్రకటించారు. నిజానికి ఆయనకిప్పుడు ప్రతిపక్ష నేత హోదా లేదు. ఈ సారి వస్తుందో ఆలోపు జైలుకెళ్తారో తెలియదు. ఆయన ఇలా అనడానికి బలమైన కారణాలున్నాయని ఆర్కేకు సమాచారం ఉంది. దాన్ని చెప్పలేక.. ఆయన పాలనను ప్రజలు మర్చిపోరని కవర్ చేసుకున్నారు.


వైఎస్ కుటుంబంలో ఆస్తుల విభజనపై మరోసారి ప్రస్తావించారు. కొత్తగా జగన్ తల్లి…తనకు కూడా ఏమీ వద్దని చెల్లికి తండ్రి చెప్పినట్లుగా ఆస్తులు ఇచ్చేయాలని అడిగినట్లుగా సంకేతాలు పంపారు. ఇది వైఎస్ చివరి కోరికన్నట్లగా ఆర్కే పరోక్ష సంకేతాలు పంపారు. అంటే ఆ దిశగా వైఎస్ ఫ్యామిలీలో కొత్త పంచాయతీ ఉందన్నమాట. ఇక వైసీపీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలపై సుదీర్ఘంగా వివరించాలనుకున్న చివరి రెండు లైన్లలో ఆ పార్టీ ముఖ్య నేతలంతా కట్ట కట్టుకుని పార్టీ మారిపోయే ఆలోచనలో ఉన్నారని చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. అయితే అలాంటివి ప్రకటించడానికి ఇది సరైన సమయం కాదని ఆయన అనుకుంటూ ఉండవచ్చు.


జగన్ మోహన్ రెడ్డి నోటి వెంట వచ్చేవన్నీ అబద్దాలే. కళ్ల ముందు కనిపించేవాటిని కూడా ఆయన అబద్దం అని చెబుతారు. మన కళ్లు మనల్ని మోసం చేస్తాయని సపోర్టర్లను మోసం చేస్తారు. అలా నమ్మేవారు ఉండటం ఆయన బలం. కానీ అలా వారిని ఎప్పుడూ మోసం చేయాలనుకోవడం ఆయన బలహీనత. దాన్ని మాత్రం చెప్పేందుకు ఆర్కే ఎక్కువ సమయం కేటాయించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: