గత కొన్ని నెలలుగా హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ఎక్కడపడితే అక్క ప్లాట్ల విక్రయాలు నిలిచిపోయాయి. రిజిస్ర్టేషన్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. దాంతో ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోయింది.
హైదరాబాద్ నగరం, చుట్టు పక్కల ప్రాంతాల్లోని చెరువులు, కుంటలను కాపాడేందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా వెలసిన కట్టడాలను కూల్చడమే లక్ష్యంగా రేవంత్ హైడ్రా ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో వైపరీత్యాల వల్ల హైదరాబాద్‌కు ఎలాంటి ప్రమాదం రాకూడదని ఆయన ముందస్తు ఆలోచనతో హైడ్రాను అమల్లోకి తెచ్చారు. దీనికి సీరియన్ ఐపీఎస్ రంగనాథ్‌ను కమిషనర్‌గా నియమించారు.
హైడ్రా అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలోని అక్రమ కట్టడాలను కూలుస్తోంది. అపార్ట్‌మెంట్లు, పెద్ద పెద్ద భవంతులు, విల్లాలు సైతం ఉన్నాయి. కోట్లాది రూపాయలు పెట్టి కొన్న విల్లాలు సైతం నేలమట్టం అయ్యాయి. వందలాది సంఖ్యలో ఇళ్లను తొలగించడంతో అందరిలోనూ భయం మొదలైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్ల మోసాల వల్ల చాలా మంది కోట్లాది రూపాయలను నష్టపోయారు.
హైడ్రా చర్యలతో ప్రజలు ఇప్పుడు ఆస్తులు కొనుగోలు చేసేందుకు భయాందోళనకు గురవుతున్నారు. దాంతో కంప్లీటుగా నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది. ఆస్తులు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎవరూ ముందుకు రావడంలేదు. ఫలితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఆందోళనలో పడిపోయారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ అప్పీల్ చేశారు. రియల్ వ్యాపారులకు భరోసానిచ్చారు. రేవంత్ ఆదేశాల మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రెస్‌మీట్ పెట్టారు. హైడ్రాపై పూర్తి స్పష్టతనిచ్చారు. చట్టబద్ధమైన అనుమతులతో వెంచర్లు ఏర్పాటు చేసుకున్న వారికి ఎలాంటి భయాందోళన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. అనుమతులు ఉంటే వారి జోలికి రామని చెప్పారు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు హైడ్రా కట్టుబడి పనిచేస్తున్నదని వివరించారు.
సీఎం రేవంత్ కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ స్థలాలను, చెరువులను, కుంటలను, నాలాలను కబ్జా చేసిన వారికి మాత్రమే హైడ్రా ఓ భూతంలాంటిదని చెప్పుకొచ్చారు.