భూతల స్వర్గం జమ్మూ కశ్మీర్. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ లో పదేళ్లు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. సుప్రీం కోర్టు తీర్పుతో ఇటీవలే ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్, కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి వచ్చింది. ఒమర్‌ అబ్దుల్లా పది రోజుల క్రితం సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పది రోజులు ప్రశాంతంగానే ఉంది.


కానీ, ఉగ్ర మూకలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. సామాన్యులే టార్గెట్‌గా జరిగిన ఈ దాడిలో ముష్కరులు ఏడుగురిని హతమార్చారు. శ్రీనగర్‌-లేహ్‌ జాతీయ రహదారిపై టన్నెల్‌ నిర్మాణ పనుల ప్రాంతంలో ఉన్న ఒక వైద్యుడు, ఐదుగురు స్థానికుతరులను చంపేశారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పనులు చేస్తున్న స్థానికులు, స్థానికేతర కార్మికులు, ఇతర సిబ్బందిపై ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, ఐదుగురు ఆస్పత్రిలో మరణించారు. మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతా ప్రశాంతంగా ఉంటుందని, ప్రజలకు రక్షణ కల్పిస్తామని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ప్రభుత్వం ప్రకటించిన వారం రోజులకే సామాన్యులపై దాడి జరగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.


ముష్కరుల దాడిలో మృతిచెందినవారిలో డాక్టర్‌ షెహనవాజ్‌తోపాటు కూలీలు ఫహీమ్‌ నజీర్, ఖలీం, మహ్మద్‌ హనీఫ్, శశి అబ్రోల్, అనిల్‌ శుక్లా, గుర్మిత్‌ సింగ్‌గా గుర్తించారు. ఉగ్రదాడి సమాచారం అందుకున్న భద్రతా బలగాలు వెంటనే రంగంలోకి దిగాయి. ఘటన స్థలాన్ని దిగ్బంంధించాయి. ఉగ్రవాదులను పట్టించుకునరేందుకు విస్తృతంగా గాలింపు చేపట్టాయి. కశ్మీర్‌ ఐజీ వీకే.బిర్డి ఇతర అధికారులు ఘటన స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.


ఇదిలా ఉండగా కశ్మీర్‌లో ఉగ్రదాడిని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఖండించారు. ఉగ్రమూకలను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. కాల్పుల ఘటనను సీఎం ఒమర్‌ అబ్దుల్లా కూడా ఖండించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. శుక్రవారరం బుల్లెట్‌ గాయాలతో మృతిచెందిన బిహార్‌ కార్మికుడి మృతదేహాన్ని షోపియాన్‌ జిల్లాలో గుర్తించామని అధికారులు తెలిపారు. ఈ ఘటన జరిగిన రెండు రోజులకే మరో ఉగ్రదాడి జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: