తెలంగాణలో బీజేపీలో ఆసక్తికర పోరు నడుస్తోంది. కొత్త అధ్యక్షుడు ఎవరెవరా అన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసి పది నెలలు అవుతున్నా.. అధ్యక్షుడి విషయంలో క్లారిటీ ఇవ్వడంలేదు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగానూ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. ఎన్నికలు అయిపోయాక రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల నుంచి తనను తప్పించాలని
కేంద్ర మంత్రిగా న్యాయం చేయాలంటే పార్టీ పగ్గాలు వేరే వారికి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.
అధిష్టానం మాత్రం ఇంకా ఈ విషయంలో ఎటూ తేల్చలేదు. దీంతో రోజురోజుకూ నేతల మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అధ్యక్ష పీఠం సంజయ్‌కి దక్కుతుందా..? లేక ఈటలకు దక్కుతుందా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ పరిస్థితి స్తబ్దుగా అన్నట్లుగా మారిపోయింది. అప్పటి నుంచి పార్టీ పెద్దగా ప్రజల్లో ఫోకస్ అవ్వలేదు. ముత్యాలమ్మ గుడి దగ్గర జరిగిన ఆందోళనలతో ఒక్కసారిగా పార్టీ యాక్టివ్ మోడ్‌లోకి వచ్చింది. ముత్యాలమ్మ టెంపుల్ ఎపిసోడ్, ఇటు గ్రూప్ 1 ఆందోళనలతో పార్టీలో మరింత ఊపువచ్చింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని బీజేపీలో గ్రూపుల కొట్లాటలు కూడా ఉన్నాయి.
కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల మధ్య కూడా సరిగా లేదని ప్రచారం ఉంది. అయితే.. రాష్ట్రంలో కాంగ్రెస్ తరువాత అంతటి గ్రూపు రాజకీయాలు బీజేపీలోనే కనిపిస్తుంటాయి. అందుకే.. ఇప్పుడు అధిష్టానం కూడా ఎటూ తేల్చుకోలేకపోతోందని టాక్ నడుస్తోంది. వరదలు, హైడ్రా విషయంలో ఒక్క అధ్యక్షుడి హోదాలో కిషన్ రెడ్డి తిరిగారు. ప్రభుత్వ పనితీరుపై నిలదీశారు. తాజాగా మూసీ వివాదం నడుస్తోంది. దీనిపై ఈటల రాజేందర్ ధర్నాలు, ర్యాలీలు చేశారు. ఇక గ్రూప్ 1 అంశంపై బండి సంజయ్ ఆందోళనకు దిగారు. ముగ్గురికి ముగ్గురు ఎవరికి వారుగా ఆందోళనలు చేపడుతుండడంతో పార్టీశ్రేణుల మధ్య కూడా గందరగోళం కనిపిస్తోంది. చివరకు అధిష్టానం సంజయ్‌కి సపోర్టుగా నిలుస్తుందా..? లేక ఈటలను అధ్యక్షుడిని చేస్తుందా అని తెలియకుండా ఉంది.