ఏపీలో రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా ఉన్నాయి. టీడీపీ కూటమిలో జనసేన బీజేపీ ఉన్నాయి. అయితే టీడీపీ పెద్ద పార్టీగా కీలకంగా ఉంది. చంద్రబాబు తన అనుభవంతో ఏపీకి నాలుగవ సారి సీఎం అయ్యారు. చంద్రబాబు అనుభవాన్ని గౌరవిస్తామని ఆయనతో అందుకే పొత్తు పెట్టుకున్నామని పవన్ ఇప్పటికి చాలా సార్లు చెప్పారు.
2026 చివరలో కానీ 2027 మొదట్లో కానీ జమిలి ఎన్నికలు వస్తే కనుక చాలా రాజకీయ పరిణామాలు మారిపోతాయని అంటున్నారు. కేంద్రంలో బీజేపీకి ఏపీలో టీడీపీతో చాలా పని ఉంది. ఆ మద్దతుతోనే మోడీ మూడోసారి ప్రధాన మంత్రి అయ్యారు. అది కాదు అని టీడీపీ అనుకుంటే మాత్రం జాతీయ స్థాయిలో చాలా రాజకీయాలు అనూహ్యంగా మారిపోతాయి. అందువల్లే బీజేపీ చంద్రబాబుని అత్యంత గౌరవంగా చూసుకుంటోంది.
అయితే వీలైనంతవరకూ జమిలి ఎన్నికలు పెట్టించి జాతీయ అజెండాతో దేశవ్యాప్తంగా ప్రజల మనసులను చూరగొంటే పూర్తి మెజారిటీ దక్కుతుందని అలా కాంగ్రెస్ ని పక్కన పెట్టేసి తాము మరింత కాలం అధికారంలో కొనసాగవచ్చు అన్నది ఒక పక్కా ప్లాన్ గా ఉంది అని అంటున్నారు. అపుడు నితీష్ కుమార్ చంద్రబాబుల మద్దతు అవసరం ఉండదని కూడా భావిస్తోంది. ఏపీలో జమిలి ఎన్నికలు వస్తే బీజేపీ జనసేన అత్యధిక సీట్లను డిమాండ్ చేస్తాయని అంటున్నారు. దాదాపు 75 సీట్లు ఈ రెండు పార్టీలు కోరుతాయని అంటున్నారు. ప్రస్తుతం జనసేన తన బలాన్ని విస్తరించుకుంటోంది. వైసీపీ నుంచి నేతలను గట్టిగా ఆయా చోట్ల ఉన్న వారిని తీసుకుంటోంది.
ఇక జమిలి ఎన్నికల తరువాత ఏపీలో ముఖ్యమంత్రి సీటు విషయంలో కచ్చితంగా షేరింగ్ ఉంటుందని అంటున్నారు. సీట్ల ఆధారం చేసుకుని జనసేన బీజెపీ ఒక వంతుగా, టీడీపీ మరో వంతుగా పాలన సాగించేలా ఒప్పందం కుదుర్చుకుంటారు అని ప్రచారం అయితే సాగుతోంది. ఇందులో ఎంతవరకూ నిజం ఉందో తెలియదు కానీ జనసైనికులు పవన్ అభిమానులు మాత్రం ఈసారి ఎన్నికలు అంటూ వస్తే మాత్రం పవన్ కళ్యాణ్ కచ్చితంగా సీఎం అవుతారని అంటున్నారు.