ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు బాగానే సెగ తగులుతున్నట్టుగా ఉంది. దీంతో ఆయన సరిచేసే ప్రక్రియను ముమ్మరం చేశారు. ముఖ్యంగా మూడు విషయాల్లో చంద్రబాబుకు ఇబ్బందులు వస్తున్నాయి.
అది కూడా ఒక్క మద్యం విషయంలోనే కావడం గమనార్హం. వెంటనే అలెర్ట్ అయిన చంద్రబాబు చర్యలకు దిగారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం విధానాన్ని రద్దు చేసి.. ప్రైవేటు మద్యం విధానాన్ని తీసుకువచ్చిన తర్వాత.. అనేక ఆరోపణలకు వేదిగా ఈ నూతన మద్యం విధానం నిలబడింది.
తమ్ముళ్ల ప్రమేయం ఎక్కువగా ఉండడంతో చంద్రబాబు వారిని హెచ్చరించారు. మద్యం విషయంలో జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పారు. అయినా.. తమ్ముళ్లు వినిపించుకోలేదు. దీనికితోడు.. వ్యాపారం ప్రారంభించి.. పట్టుమని పది రోజులు కూడా కాకముందే.. తణుకు, తుని తదితర నియోజకవర్గాల్లో బెల్టు షాపులు తెరమీదికి రావడం మరో ఇబ్బందిగా మారింది. ఇలా వెలుగు చూడగానే.. అలా సోషల్ మీడియాలో ఈ బెల్టు షాపులపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఈ పరిణామం సర్కారుకు సెగ పెట్టేలా తయారైంది. గుంటూరు, విజయవాడ, విశాఖ, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మద్యం ధరలు ఆకాశానికి ఎగబాకాయి. మద్యం బాటిళ్లను ఎంఆర్‌పీకి విక్రయించాల్సి ఉన్నా.. స్థానికంగా ఉన్న రాజకీయ వివాదాలు.. నేతల జోక్యంతో పెరిగిపోయిన వాటాల కారణంగా.. క్వార్టర్ బాటిల్‌పై 10-15 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో మందు బాబులు ఆధారాలతో సహా చూపించి నానా రచ్చ చేస్తున్నారు.
ఈ పరిణామాలు క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నా.. సర్కారుకు మాత్రం సెగ పెంచుతున్నాయి. బెల్టు షాపులు ఒకవైపు, ఎంఆర్ పీ కంటే ఎక్కువగా విక్రయించడం మరోవైపు, తమ్ముళ్ల వాటాలు ఇంకోవైపు.. ఇలా మూడు రకాలుగా నూతన మద్యం పాలసీ.. నానా కష్టాలు పడుతోంది. దీనిపై స్పందించిన చంద్రబాబు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఎంఆర్ పీ కంటే ఎక్కువకు అమ్మితే దుకాణ దారులపైనే చర్యలు తీసుకునే అధికారులు ఇచ్చారు. రూ.5 లక్షల జరిమానా విధించాలన్నారు. ఇక, వాటాలు అడిగినట్టు తేలిన తమ్ముళ్లపై పార్టీపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. మరి ఈ చర్యలు ఏమేరకు.. సక్సెస్ అవుతాయో చూడాలి.