తెలంగాణలో ఎన్నికలు జరిగి ఏడాది కావొస్తున్నా రాజకీయాలు ఆగడం లేదు. ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్ధి అని చెప్పే నేతలు కూడా రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పది నెలలుగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజకీయాలు ఇలా నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీపావళికి ముందే.. తెలంగాణలో పొలిటికల్ బాంబులు పేలతాయని ప్రకటించారు. పరోక్షంగా అరెస్టులు ఉంటాయని తెలిపారు. కానీ.. దీపావళి రానే వచ్చింది. ఇప్పటి వరకు పెద్ద బాంబులు ఏవీ పేలలేదు. జన్వాడా ఫామ్‌హౌస్‌లో పార్టీ.. డ్రగ్స్ వినియోగం వంటి అంశాలతో ఓ బాంబు పేలినా అది పెద్దగా ప్రభావం చూపినట్లు కనిపించడం లేదు. ఈ తరుణంలో తాజాగా 36 గంటల థంబ్‌నెయిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై విచారణ జరుపుతున్న ప్రభుత్వం దీనికి సబంధించిన అరెస్టులు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచారణ తుది దశకు చేరింది. అంతా కేసీఆర్, హరీశ్‌రావు చేశారని అధికారులు కమిషన్ ఎదుట చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టులు ఉండే అవకాశం ఉంది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనూ విచారణ జరుగుతోంది. ఈ కేసుకు సబంధించి కేసీఆర్, కేటీఆర్‌ను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇది కాకుంటే.. ధరణిలో అక్రమాలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలు, గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాల సాకుతో అరెస్టులు చేసే అవకాశం ఉంది.
ఇటీవల బీఆర్‌ఎస్ రుణమాఫీ, రైతుభరోసా, ఆరు గ్యారంటీలు, ఇతర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తోంది. ఈ తరుణంలో ప్రతిపక్షాన్ని కట్టడి చేయడంలో భాగంగా రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. కాళేశ్వరం, డ్రగ్స్ కేసులో కేసీఆర్, కేటీఆర్‌ను అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. పేలితే మొదటి ఇదే బాంబు పేలాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేదంటే జన్వాడ ఫాంహౌస్ తరహాలో 36 గంటల్లో పేలే బాంబులు కూడా తుస్సమంటాయన్న విశ్లేషకులు పేర్కొంటున్నారు.