ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఈ నెల 12 నాటికి అయిదు నెలలు పూర్తి అవుతాయి. కూటమి ప్రభుత్వం మీద పాజిటివిటీ ఎంత పెరిగింది అలాగే వ్యతిరేకత ఏమైనా ఏర్పడిందా అంటే చర్చ మాత్రం చాలా తమాషాగా సాగుతోంది. ఏపీలో విశేష అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు సీఎం గా ఉన్నారు.
చంద్రబాబు తన పొలిటికల్ కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు భాగస్వామ్యంతో సర్కార్ బండి ని ముందుకు తీసుకెళ్తున్నారు. టీడీపీ మీద జనాలకు విపరీతమైన ఆశలు ఉన్నాయి. కూటమి సర్కార్ పవర్ ఫుల్ గా జనంలో ముద్ర వేయలేకపోతోందా అన్న చర్చ ఉండనే ఉంది. ఇసుక, మద్యం వంటి వాటి విషయంలో ప్రభుత్వ పాలసీలే దెబ్బ తీసేలా ఉన్నాయా అని అంటున్నారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళల మీద జరుగుతున్న వరస సంఘటనలు అఘాయిత్యాలు. ఘోరాలు నేరాలు. వీటిని ప్రభుత్వం అదుపు చేయలేకపోతోంది అనే విమర్శ ప్రజలలోకి మెల్లగా వెళ్ళిపోతోంది. వైసీపీ నేతలు అయితే వందకు పైగా అఘాయిత్యాలు ఏపీలో చోటు చేసుకున్నాయని ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపుగా ఫోకస్ పెడుతోంది. అలాగే సంక్షేమానికి కూడా మెల్లగా అవకాశం ఇస్తోంది. అయితే ఇవేమీ జనంలోకి పోకుండా ఈ మూడు అంశాలే పెద్ద ఎత్తున చర్చకు తావిస్తున్నాయి. దీని మీద కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా సీరియస్ గానే ఉన్నారు.
విశాఖ పర్యటనలో ఉన్న చంద్రబాబు అయితే మహిళల మీద అత్యాచారాలు చేసిన వారిని నడి రోడ్డు మీద ఉరి తీయాలని కూడా గట్టిగా చెప్పారు అంటే పరిస్థితి ఏపీలో ఇబ్బందికరంగా ఉందనే అంటున్నారు. బెల్ట్ షాపులు ఎవరైనా నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఏది ఏమైనా అనుకున్న స్థాయిలో ఇమేజ్ అయితే ఈ నాలుగైదు నెలలలో బిల్డప్ కావడం లేదు అనే అంటున్నారు. ప్రభుత్వ పనితీరు బాగుందని పాజిటివ్ రావడంతో పాటు గ్రాఫ్ పెరగాలంటే దానికి ఏమి చేయాలన్నది కూటమి సర్కార్ పెద్దలే ఆలోచించుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.