పదేళ్ల తరువాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రతిదాంట్లోనూ కాంగ్రెస్‌కు అడ్డుపడుతూనే ఉంది.  బీజేపీ కూడా ఏమాత్రం తగ్గకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై అటాక్ చేస్తూనే ఉంది. గ్రూప్ 1, మూసీ తదితర వివాదాలపై ఇరు పార్టీలు కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. ఇలా ఎవరికి వారుగా కాంగ్రెస్ పార్టీపై అటాక్ చేస్తూనే ఉన్నాయి.


అయితే.. రేవంత్‌కు ప్రతిపక్ష పార్టీల నుంచి ఈ విధమైన తలపోటు ఉంటే.. కొందరు సొంత పార్టీ నేతల వైఖరి కూడా ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న లాంటి వాళ్లు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆయన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అయినప్పటికీ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. దాంతో ఆయనను ఆదర్శంగా తీసుకొని చాలా మంది నేతలు తమ వాయిస్ వినిపిస్తున్నారు.  ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యతిరేక వాయిస్‌లకు బ్రేక్ వేయాలని నిర్ణయించుకున్నారు. లేదంటే భవిష్యత్తులో పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందులు రావచ్చన్న ఉద్దేశంతో ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకోవడమే కాకుండా వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.


కులగణనపై గాంధీభవన్‌లో సమావేశం నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి సైతం హాజరయ్యారు.  పార్టీలైన్ తప్పినా.. పార్టీకి వ్యతిరేకంగా మట్లాడినా సహించేది లేదన్నారు. పార్టీ మాట అంటే మాటేనని.. దానిని కాదని వేరే మాట్లాడితే పార్టీ ద్రోహులేనని అన్నట్లుగా చెప్పారు. తనకంటూ ప్రత్యేక ఎజెండా ఏమీ లేదని, పార్టీ ఎజెండానే తన ఎజెండా అని స్పష్టం చేశారు.


ప్రాంతీయ పార్టీల్లో అధినేత తీసుకున్న నిర్ణయానికి పెద్దగా ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడరు. మాట్లాడలేరు కూడా. కానీ.. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించడంపై సీఎం ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వచ్చినట్లుగా వారు స్టేట్మెంట్లు ఇవ్వడం అలవాటు. అంతేకాకుండా గ్రూపుల కుమ్ములాటలూ సరేసరి.  ముఖ్యంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచరుడు జగిత్యాలలో మర్డర్ అయ్యాడు. దాంతో ఆయన కూడా ఫిరాయింపుదారులపై కీలక కామెంట్స్ చేశారు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారన్నది స్పష్టం అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: