తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న సమగ్ర కుటుంబ సర్వే రేపటి నుంచే ప్రారంభం కానుంది. ఈ సర్వేతో తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. మరి, సర్వేలో అధికారులు ఏం అడగనున్నారు అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


ప్రజలకు మేలైన పాలన అందించాలన్నా... అర్హులకు అన్ని పథకాలు అందాలన్నా.. ఈ సమగ్ర కుటుంబ సర్వే తప్పని సరి అని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్రక్రియ జరిగే సమయంలో ఇంటి యాజమాని ఒక్కరు ఉండే సరిపోతుందని ఓ సర్వే అధికారి తెలిపారు.  ఈ ప్రక్రియలో మెుత్తం గా 56 ప్రశ్నలను సర్వే అధికారులు మనల్ని అడుగుతారు.



రాష్ట్రంలోని SC,ST,BC ఇతర బలహీన వర్గాల్లో విద్య, ఉపాధి, సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాలు పెంచేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అసెంబ్లీలో చేసిన తీర్మానం మేరకు దాదాపుగా రూ.150 కోట్ల ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రభుత్వం అంచనాగా తెలిపింది. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మార్చిలో జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ నిధుల వివరాల అంశం ఉంది.



సమగ్ర కుటుంబ సర్వేలోనే కుల, ఉపకులం వంటి వివరాలను సేకరిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన రిజర్వేషన్ అమలు చేసేలా ప్రభుత్వం ప్రణాళిక చేస్తోంది. సర్వేలో కుటుంబానికి ఎంత భూమి ఉందో తెలుస్తుంది.  దీని ప్రకారం రైతులకు పంట భరోసా పథకం అమలు చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ సర్వే పూర్తయితే 7 నుంచి 10 ఎకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులను గుర్తించి సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా ఇచ్చే ఆలోచన చేస్తోంది.  ఈ సర్వే పారదర్శకంగా జరిగితే తెలంగాణలోని ప్రతి ఇంటి ముఖ చిత్రం ప్రతిబింబం అవుతుంది. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీ హామీల అమలుకు మార్గం సుమగం అవుతుంది.  అలాగే అనర్హుల ఏరివేతకు అవకాశం దొరుకుతుంది. ఫలితంగా ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైస అర్హుడైన పేదలకి చేరుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: