అమెరికా నూతనాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాధ్యక్షుడి హోదాలో రెండోసారి ట్రంప్ వైట్ హౌస్ లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. గెలుపు అనంతరం ఏర్పాటు చేసిన ప్రసంగంలో ట్రంప్ మాట్లాడుతూ పలు కీలక విషయాలను ప్రస్తావించారు. అందులో ముఖ్యంగా దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడటంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఇకనైనా యుద్ధాలను ముగించి శాంతి వాతావరణం ఏర్పడే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తానని ట్రంప్ అన్నారు. అయితే, తన ప్రసంగంలో ఎక్కడా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ పేర్లను ఆయన ప్రస్తావించలేదు. అయితే, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ అంశం ట్రంప్ ప్రధాన ఎజెండాలలో ఒకటి కావచ్చని నిపుణులు అంటున్నారు.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ తన పాలనలో అసలు యుద్ధాలు జరగలేదని బదులుగా ఐఎస్‌ఐఎస్ ను మట్టికరిపించామని అన్నారు. 2016 నుండి 2020 వరకు ట్రంప్ హయాంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ను కలిసిన ట్రంప్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. సింగపూర్‌లో జరిగిన చారిత్రాత్మక శిఖరాగ్ర సమావేశంలో కిమ్ తో కరచాలనం చేశాడు. ఆ దేశాధ్యక్షుడిని కలిసిన మొదటి సిట్టింగ్ యుూఎస్ అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచాడు.
ఈ రోజు అమెరికా ఎన్నికల ఫలితాల కోసం ఉక్రేనియన్లు భయాందోళనలతో ఎదురుచూశారు. ట్రంప్ విజయం సాధించినట్లయితే రష్యా దళాలతో పోరాడుతున్న ఉక్రెయిన్ కు వాషింగ్టన్ సహాయం అందకపోవచ్చనే భయాలు నెలకొన్నాయి. సంఖ్యాబలం, ఆయుధ సంపత్తి లేని ఉక్రేనియన్ సైన్యం రష్యా దళాలకు వ్యతిరేకంగా వెనుకంజలో ఉంది. ఉత్తర కొరియాతో మాస్కో కూటమి గతంలో కంటే మరింత దృఢంగా కనిపిస్తుంది, వాషింగ్టన్, సియోల్ కు వేల సంఖ్యలో ఉత్తర కొరియా దళాలను రష్యాకు పంపినట్లు తెలుస్తోంది. మరి అమెరికాను నమ్ముకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ పరిస్థితి ఎటూ కాకుండా మధ్యలో ఆగిపోయిందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఏం జరగుతుందో చూడాలి.