గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యాధునిక హంగులతో తెలంగాణ సెక్రటేరియట్ ను నిర్మించింది.  గత కొంతకాలంగా తెలంగాణ సెక్రటేరియట్లో వాస్తు దోషాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో మార్పులకు శ్రీకారం చుట్టినట్టు తాజాగా తెలుస్తోంది.

 

ప్రస్తుతం తూర్పు దిశగా ఉన్న సచివాలయం ప్రధాన మహాద్వారం ఈశాన్యం వైపుకు మార్చడంతో పాటు, అలాగే ఆగ్నేయం వైపు ఉన్న గేటు నెంబర్ రెండు నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వైపు ఉన్న గేటు నెంబర్ 4 వరకు నేరుగా వెళ్లేలా రహదారిని ఏర్పాటు చేయనున్నారు.  బాహుబలి గేటుగా పిలిచే మెయిన్ గేటును పూర్తిగా మూసివేయనున్నట్టు, ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. హుస్సేన్ సాగర్ వైపు కూడా మరో కొత్త గేటును పెట్టడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక హుస్సేన్ సాగర్ గేటు నుంచి సీఎం లోపలికి ప్రవేశించి గేటు నెంబర్ మూడు నుండి బయటకు వెళ్లే లాగా డిజైన్ చేస్తున్నారని సమాచారం.

 

ఇక సచివాలయ ప్రధాన ద్వారానికి ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో వాస్తు ప్రకారం అన్ని పక్కాగా ఉండేలా రేవంత్ రెడ్డి ఆదేశాలతో మార్పులు జరుగుతున్నాయని తెలుస్తుంది. మెయిన్ గేటు ఎదురుగానే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన క్రమంలో ఆ గేటు ద్వారా రాకపోకలు జరిపితే ఇబ్బంది కలుగుతుందన్న భావనలోనే బాహుబలి గేటును పూర్తిగా మూసివేస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో తాజాగా చేస్తున్న వాస్తు మార్పుల పైన రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది.

 

గత ప్రభుత్వం తెలంగాణా సెక్రటేరియట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసింది. సెక్రటేరియట్ వాస్తు ప్రకారం నిర్మాణం జరగలేదని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సెక్రటేరియట్ నిర్మాణం జరిగిన అనతి కాలంలోనే బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చాక వాస్తవానికి ఈ ఏడాది జూన్‌లోనే సచివాలయ ప్రధాన మహాద్వారాన్ని మూసివేశారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr