సక్సెస్‌ఫుల్ ఎన్నికల స్ట్రాటజిస్ట్‌గా ప్రశాంత్ కిషోర్‌కు మంచి పేరుంది. ఆయన ఏ రాష్ట్రంలో ఏ పార్టీ తరఫున పనిచేసినా.. అక్కడ ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న భరోసా ఉంది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలో రావడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.  2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చేలా చేశారు.  ఆ తరువాత ఎన్నికల్లో పీకే చంద్రబాబు వెంట నడిచారు.


2017లో పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కోసం పనిచేశారు. ఇక.. 2020 ఎన్నికల్లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసి ఆ పార్టీ ఘన విజయానికి కారణం అయ్యారు. అలాగే.. 2021లో తమిళనాడులో డీఎంకే, పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ గెలుపు కోసం కృషి చేశారు.


2023లో కీలక పీకే తన ఐ-ప్యాక్ వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకున్నారు. జన సూరజ్ పేరిట కొత్తగా పార్టీని పెట్టారు. బిహార్ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేశారు. ఇప్పుడు అక్కడ పలు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏదైనా పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తే ఎంత తీసుకుంటారనే దానిపై రకరకాల ప్రచారాలు వినిపించాయి. కానీ.. తాను తీసుకునే రెమ్యునరేషన్‌పై పీకే ఒక్కసారిగా నోరుజారారు.


తాను ఏ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసినా అందుకు ఫీజు కింద రూ.100 కోట్లు వసూలు చేస్తానని పీకే ఆ ప్రచారంలో భాగంగా చెప్పారు. కొన్ని పార్టీల వద్ద అంతకన్న ఎక్కువే తీసుకుంటానని వ్యాఖ్యలుచేశారు. దేశంలో పది ప్రభుత్వాలు తన వ్యూహాలతోనే అధికారంలో కొనసాగుతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు.  ఒక పార్టీకి ఎన్నికలకు వ్యూహకర్తగా పనిచేస్తే.. తన పార్టీని రెండేళ్ల పాటు నడిపించవచ్చని అన్నారు. అయితే.. పీకే వ్యాఖ్యలతో ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న.. గతంలో అధికారంలో కొనసాగిన పార్టీలు గందరగోళంలో పడ్డాయి.  


పీకేకు ఇవ్వడానికి ఆ పార్టీల దగ్గర రూ.100 కోట్లు ఎక్కడివి..? దేని ద్వారా వాటిని సేకరించారు..? పీకేకు చెల్లించిన మొత్తాన్ని ఎన్నికల ఖర్చుల్లో చూపించారా..? అన్న ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మొత్తానికి పీకే వ్యాఖ్యలు ఆయా పార్టీలు తప్పనిసరిగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిని తెచ్చాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: