తిరుమల లడ్డు వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్, దాని కాలపరిమితపై భక్తుల్లో చర్చలు నడుస్తున్నాయి.
ఈ సమయంలో... తిరుమల తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలంటూ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఆయన వాదనలు, సుప్రీం వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి! హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించే తిరుమల తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూ.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కి స్వయం ప్రతిపత్తి హోదా కల్పించాలని కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.
ఈ సందర్భంగా తన పిటిషన్ పై స్వయంగా వాదనలు వినిపించిన కేఏ పాల్... 746 మంది కాథలిక్స్ కోసం వాటికన్ సిటీ ఏర్పాటు చేసినప్పుడు, 30 లక్షల మంది భక్తులు ఉన్న తిరుపతి సిటీని ఎందుకు కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయలేమని ప్రశ్నిస్తూ.. దీనికి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21, 25, 26 లను ఎత్తి చూపారని తెలుస్తోంది.
ఇదే సమయంలో... ఆలయాలను రాజకీయంగా వాడుతున్నారని కోర్టుకు తెలిపారు! ఇదే సమయంలో... తిరుమల లడ్డూ వ్య్వహారంపై అక్టోబర్ 3న సుప్రీకోర్టు పలు ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటిలో ఎలాంటి పురోగతీ లేదని కోర్టు దృష్టికి తీసుకొస్తూ.. కమిటీకి టైం బాండ్ తో కూడిన ఆదేశాలు ఇవ్వాలని కోరినట్లు చెబుతున్నారు.
దీనిపై స్పందించిన ధర్మాసనం... ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని తాము నేరుగా కేంద్రన్ని ఆదేశించలేమని.. ప్రత్యేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై పార్లమెంట్ లో సవరణలు జరుగుతాయని చెప్పారు. మీ అభ్యర్థన ప్రకరమే వెళ్తే... దేశంలోని పుణ్యక్షేత్రాలు, గురుద్వారాలు, ఇతర మందిరాలన్ను ప్రత్యేక రాష్ట్రాలుగా చేయాల్సి వస్తుందంటూ సుప్రీం వ్యాఖ్యానించింది! ఈ పిటిషన్ ను కొట్టివేసింది!
మరోవైపు.. సుప్రీంకోర్టు నిర్ణయంపై పాల్ స్పందించారు. తాను దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కేవలం ఐదు నిమిషాలే విచారించిందని అన్నారు. తన పిటిషన్ కు కేవలం ఐదు నిమిషాలే ఇచ్చారని.. ఇంతటి ప్రాధాన్యమున్న విషయంలో ఎక్కువ సమయం కేటాయించలేదని.. దీనిపై మరోసారి రివ్యూ పిటిషన్ వేస్తామని అన్నారు!