చేతి నిండా పని వైసీపీ నేతలకు కూటమి పెద్దలు చెబుతున్నారు. ఎన్నికల్లో ఓటమి చెంది నిరాశ నీడలోకి వెళ్ళిపోయిన వారిలో కొత్త పౌరుషం రగిలిస్తున్నారు. ఇక్కడితో ఆట అయిపోలేదు బస్తీమే సవాల్ అని అంటున్నారు.  ఏపీలో వైసీపీ కునారిల్లి దశ దిశ లేని పరిస్థితుల్లో ఉంది. ఇంకా చెప్పాలంటే వచ్చిన పదకొండు అసెంబ్లీ సీట్లతో ప్రతిపక్ష హోదా మిస్ అయి అయోమయంలో పడిపోయింది.



వైసీపీ అధినేత అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా అడుగుతుంటే కూటమి పెద్దలు మాత్రం ఏకంగా ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీకి అసలు ప్రతిపక్ష హోదానే ఇస్తున్నారు. వారు వైసీపీని గత అయిదు నెలలలో టార్గెట్ చేసిన తీరు గతంలో వైసీపీని గుర్తుకు తెస్తోంది.

వైసీపీ తనకు లభించిన మెజారిటీతో పాలన సవ్యంగా చేయకుండా టీడీపీని అణచడానికి చూసింది. జనసేనను నిర్బంధించడానికి ఎక్కువ ఆలోచించింది. చివరికి ఆ రెండు పార్టీలు బలంగా నిలిచి పోరాడాయి. భారీ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చాయి.



ప్రత్యర్థిని ఎంత టార్గెట్ చేస్తే అంతగా ఎదుగుతారు అన్నది చరిత్ర చెప్పిన సత్యం. ఆనాడు టీడీపీని లేకుండా చేస్తామని వైసీపీ గట్టి పట్టుదలకు పోయినా ఫలితం నిల్. ఈనాడు వైసీపీ ఆనవాళ్లు లేకుండా చేయాలని కూటమి పెద్దలు ఆలోచించినా అదే జరుగుతుంది అని అంటున్నారు. ఇక్కడ అంతా మరచిపోతున్నది ఏంటి అంటే జనాలను. జనాలు ఎపుడూ ప్రతిపక్షం వైపు ఉంటారు. వారు అధికారం అప్పగించేంతవరకే మద్దతు ఇస్తారు. ఆ మరుక్షణం వారే సైలెంట్ స్పెక్టేటర్లుగా మారి అంతా గమనిస్తారు. వారికి ఎలాంటి వివక్ష ఉండదు, తీర్పు కఠినంగానే ఎపుడూ ఉంటుంది.


అదే సమయంలో అధికారంలోకి వచ్చిన పార్టీ ఎపుడూ అన్నీ చేయలేదు, ఒకవేళ ఎంత చేసినా ఇంకా కావాలన్నదే జనం నైజం.

వైసీపీ తీరు చూస్తే 40 శాతం ఓటింగ్ షేర్ తెచ్చుకుని కూడా దిగాలుగా ఉంది. అటువంటి చోట తట్టి లేపుతోంది కూటమి సర్కార్.



సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెద్ద ఎత్తున కట్టడం ఇందులో భాగమే అనుకోవాలని అంటున్నారు.  తమ వైపు ఉన్న వారు అంతా సుద్ద పూసలని అవతల వైపున ఉన్న వారే అన్నీ చేశారని భావిస్తూ ఏకపక్షంగా కేసులు పెడితే అది చివరికి ఇబ్బంది అవుతుంది. అయినా కూడా ఇపుడు ఇవి అవసరమా అన్న చర్చ సైతం ఉంది.


ఏపీలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి రాజకీయ కక్ష కావేశాలకు ఈ విధంగా విలువైన టైం వెచ్చిస్తే చివరికి అది ప్రభుత్వంలో ఉన్న వారికే ఇబ్బంది అవుతుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: