వైసీపీ అధినేత జగన్ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారా? తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారా?  సొంత పార్టీ శ్రేణులకు ఇది మింగుడు పడడం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జగన్ ఒకవైపు మొండిగా ముందుకు వెళుతుంటే..మరోవైపు కూటమి ప్రభుత్వం పక్క ప్లాన్ తో వెళ్తోంది. అవసరమైతే అనర్హత వేటు ఆలోచన చేయడానికి డిసైడ్ అయింది.


ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. జగన్ అసెంబ్లీకి మెహం చాటేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని కారణం చెబుతూ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొడుతూ వస్తున్నారు.  తొలి అసెంబ్లీ సమావేశాల సమయంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ ఢిల్లీ వెళ్ళిపోయారు.  తాజాగా ఈ అసెంబ్లీ సమావేశాలను బాయ్ కట్ చేశారు. 40 శాతం ఓటింగ్ దక్కించుకున్న తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేవరకు శాశ్వతంగా శాసనసభను బాయ్ కట్ చేస్తామని చెబుతున్నారు. అదే జరిగితే జగన్ తో పాటు 10 మంది ఎమ్మెల్యేలు ప్రమాదంలో పడినట్టే.

 

నిబంధనల మేరకు ఉద్దేశపూర్వకంగా అసెంబ్లీకి రాకుంటే.. ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విధించే అధికారం స్పీకర్ కు ఉంది. రాజ్యాంగం ఈ విచక్షణ అధికారాన్ని కల్పించింది. తెలంగాణలో సైతం ఇదే మాదిరిగా వ్యవహరించారు కేసీఆర్. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన సమయంలోనే అసెంబ్లీకి హాజరయ్యారు. తరువాత ముఖం చాటేసారు. కేవలం అనర్హత వేటు పడుతుందన్న భావనతో సరిగ్గా బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. ఇప్పుడు ఇది జగన్ కు కూడా వర్తిస్తుంది. కానీ ఇది తెలియని జగన్ మాత్రం శాశ్వతంగా అసెంబ్లీకి రానున్న రీతిలో వ్యవహరిస్తున్నారు.


కనీసం పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన మాటలు కూడా వినడం లేదు.అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుంటే ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత వస్తుందని చెప్పినా..అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని జగన్ నిర్ణయించుకున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరికి ఈ విషయం తెలియదని తెలుస్తోంది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరైతే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ ఇలానే ముందుకు సాగితే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని సొంత పార్టీ నేతలే భావిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: