సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం క్రమంగా కోలుకుంటోంది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇప్పటికే మంగళగిరి, చిలకలూరిపేట సహా పలు కీలక నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జీలను నియమించింది.


ఈ క్రమంలో రీజినల్ కోఆర్డినేటర్లను అపాయింట్లను కూడా భర్తీ అయిన విషయం తెలిసిందే. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఎంపీలు మిథున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వంటి సీనియర్ నేతలకు ఆ బాధ్యతలను అప్పగించింది. భారీగా మార్పులు చేర్పులు చేసింది. ఎన్నికలకు ముందు ఈ హోదాలో పని చేసిన వాళ్లలో కొందరిని కొనసాగించినప్పటికీ- వాళ్లు పర్యవేక్షించిన రీజియన్లు మారాయి.


తాజాగా రాష్ట్రస్థాయి కోఆర్డినేటర్‌ను నియమించారు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను నిర్వర్తించిన సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డిని ఆ పదవిలో అపాయింట్ చేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సమన్వయకుడిగా సజ్జల నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.  ఇప్పుడున్న రీజినల్ కోఆర్డినేటర్లను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవడం, ఆయా ప్రాంతాల నుంచి నివేదికలను తెప్పించుకోవడం, వాటిని విశ్లేషించడం.. వంటి కీలక బాధ్యతలు ఆయన చేతిలో పెట్టినట్టయింది.


సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం పొందడానికి సజ్జల ఓ కారణం అనే భావన వైఎస్ఆర్సీపీ క్యాడర్‌లో బలంగా ఉందనేది బహిరంగ రహస్యమే.  పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు, డైహార్డ్ జగన్ అభిమానులు సైతం ఎక్స్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చిన సందర్భాలు ఉన్నాయి.



అయినా మరోసారి జగన్ సజ్జలపై నమ్మకం ఉంచారు. రాష్ట్రస్థాయి కోఆర్డినేటర్ అనే కీలక పదవిని ఆయనకు అప్పగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆవిర్భావం నుంచీ పార్టీలో కొనసాగుతూ వస్తోండటం, కష్టకాలంలోనూ తన వెన్నంటి ఉండటం, అత్యంత నమ్మకస్తుల్లో ఒకరు కావడం వల్లే రాష్ట్ర కోఆర్డినేటర్ పదవి భర్తీ విషయంలో జగన్.. సజ్జల రామకృష్ణారెడ్డి వైపే మొగ్గు చూపారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: