రెండున్నరేళ్లకు పైగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం అంచున ఉంది. ఉక్రెయిన్ కు అందించిన దీర్ఘ శ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపైకి ప్రయోగించేందుకు అమెరికా అనుమతివ్వడంతో పరిస్థితి అణు యుద్ధం వరకు వచ్చింది. దీంతో నాటో దేశాలు మరీ ముఖ్యంగా కొత్తగా చేరిన ఫిన్లాండ్, స్వీడన్ వణికిపోతున్నాయి.
ఉక్రెయిన్ సైతం రష్యాపైకి ఆరు దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించేసింది. ఇంత జరుగుతుంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ చూస్తూ ఊరుకుంటారా? గట్టిగా బదులు తీర్చుకునేందుకు ఏదైనా చేయడం ఆయన నైజం. అందుకే ప్రపంచం యావత్తూ ఉత్కంఠంగా ఉంది.
అమెరికా అధ్యక్షుడు ఎక్కడికైనా వెళ్తే ఎంత భద్రత ఉంటుందో అందరికీ తెలిసిందే. చీమ చిటుక్కుమన్నా పసిగట్టే కమాండోలు విధుల్లో ఉంటారు. అయితే, రష్యా అధ్యక్షుడికీ అదే స్థాయిలో భద్రత ఉంటుందనే భావించాలి. కాగా, ఇప్పుడు ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న యుద్ధంలో దీర్ఘ శ్రేణి క్షిపణుల వాడకానికి ఉక్రెయిన్ కు అమెరికా అనుమతి ఇవ్వడంతో పరిస్థితి ఎక్కడకు వెళ్తుందో తెలియని పరిస్థితి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రమై అమెరికా నేరుగా రంగంలోకి దిగితే..? ఈ క్రమంలో పుతిన్ సహా రష్యా అగ్ర నాయకత్వాన్ని నాటో కూటమిలోని పాశ్యాత్య దేశాలు హతమారిస్తే? ఇదంతా జరగాలని కాదు కానీ.. ఒకవేళ జరిగితే...? అప్పుడు అది ప్రపంచానికే పెను ప్రమాదం అని చెప్పాలి. ఎందుకంటే రష్యా వద్ద డెడ్ హ్యాండ్ (పెరీమీటర్) అనే వ్యవస్థ ఉంది. ప్రపంచాన్ని అంతం చేయగల సత్తా దీని సొంతం అట.
అమెరికా, నాటో కూటమి దాడిలో తమ బలగాలన్నీ తుడిచిపెట్టుకుపోయినా.. రష్యా అధికారి ఎవరైనా ఒక్కరు పెరీ మీటర్ ను ఆపరేట్ చేస్తే చాలట.. రష్యా వద్ద ఉన్న అణ్వాయుధాలు మొత్తం శత్రు దేశాల మీదకు దూసుకెళ్తాయి. దీనికి కారణం ఏమంటే.. ''మనమే పోయే పరిస్థితి వస్తే.. మనతో పాటు అందరూ పోవాలి'' అనే సూత్రంతో సోవియట్ యూనియన్ కాలంలో ఈ వ్యవస్థను రూపొందించారట.