ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరు కావడం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో గైర్హాజరవుతూ వస్తోంది. ఇంకోవైపు శాసనమండలి సమావేశాలకు మాత్రం వైసీపీ సభ్యులు హాజరవుతున్నారు.



అయితే ఈ తరుణంలో అసెంబ్లీలో పిఎసి చైర్మన్ పదవి భర్తీ చేయాల్సి వచ్చింది.  దీంతో కూటమికి, వైసీపీకి మధ్య ఈ పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది.  సంఖ్యాపరంగా చూస్తే వైసీపీకి పదవి దక్కదు. కానీ ప్రతిపక్షానికి పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. మండలిలో తమకు ఉన్న సంఖ్యాబలంతో పోటీ చేయాలని వైసీపీ భావిస్తోంది. అనూహ్య నిర్ణయాలు జరిగితే మినహా ఈ పదవి వైసిపికి దక్కే అవకాశమే లేదు.  



వాస్తవానికి ఈ పదవిని ప్రతిపక్షాలకి కేటాయిస్తారు. కానీ వైసీపీకి ఆ పదవి దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. చైర్మన్ తో పాటు సభ్యుల ఎంపికకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు మధ్యాహ్నం వరకు నామినేషన్ల దాఖలకు గడువు ఇచ్చింది. ఈరోజు సింగిల్ నామినేషన్లు దాఖలు అయితే ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. లేకుంటే మాత్రం రేపు ఓటింగ్ జరపనున్నారు.


175 అసెంబ్లీ సీట్లకు గాను.. కూటమికి 164 సీట్ల బలం ఉంది. వైసిపి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. శాసనసభ చరిత్ర తీసుకుంటే గత ఆరు దశాబ్దాలుగా పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికి దక్కుతూ వస్తోంది.  2019లోను పీఏసీ చైర్మన్ గా టీడీపీకి చెందిన చెందిన పయ్యావుల కేశవ్ కు అవకాశం ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఏకంగా ఎన్నికలకు సిద్ధపడుతుండడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. పీఏసీతోపాటు ఇతర కమిటీలకు ఎన్నికలు నిర్వహించాలన్న తీర్మానాన్ని సీఎం చంద్రబాబు తరఫున ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో, మండలిలో లోకేష్ ప్రవేశపెట్టారు.


టీడీపీ తర్వాత జనసేన ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్షంగా తమకే పీఏసీ చైర్మన్ పదవి కావాలని వైసీపీ కోరుకుంటుంది. అందుకే మండలిలో సంఖ్యాబలం బట్టి పోటీకి సిద్ధపడుతోంది. అయితే శాసనమండలి సభ్యుడికి పీఏసీ చైర్మన్ గా ఛాన్స్ ఉంటుందా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు జనసేనకు పిఎసి చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: